08-08-2025 11:51:45 PM
పలు అభివృద్ధి పనులపై మంత్రులకు వినతి...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): కేంద్రంలోని పలువురు మంత్రులను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్(MP Godam Nagesh) కలిసారు. ఢిల్లీలో శుక్రవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జయోల్ ఓరం, కేంద్ర సాంసృతిక శాఖ మంత్రి గజేంధర్ సింగ్ షెకావత్ లను కలిసిన ఎంపీ తన పార్లమెంట్ పరిధిలోని పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదిలాబాద్ జిల్లాలో నవోదయ పాఠశాల మంజురు చేయాలని కేంద్ర విద్యా-శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విన్నవించారు. అదేవిధంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(యూ) మండలంలో గిరిజన ఏకలవ్య, గిరిజన మాడల్ పాఠశాల మంజూరు చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జయోల్ ఓరం వినతిపత్రం అందజేశారు. నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని కేంద్ర సాంసృతిక శాఖ మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ ని కోరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియో-జకవర్గం లోని పలు అభివృద్ధి పథకాలు మంజురు చేయాలని విన్నవించడంతో మంత్రులు తమ సానుకూలతను వ్యక్తపర్చినట్లు ఎంపీ నగేష్ తెలిపారు.