calender_icon.png 19 August, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజా విసురుతున్న చలి!

11-12-2024 01:16:20 AM

  1. గ్రామాల్లో పెరుగుతున్న చలి తీవ్రత
  2. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
  3. పొగమంచు చాటున పొంచి ఉన్న ప్రమాదం
  4. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 10: రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణో గ్రతలు క్రమంగా పడిపోతుండటంతో గ్రామాల్లో చలి పంజా విసురుతోంది. మంగళవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదైంది. రాత్రి, తెల్లవారుజామున చలి ప్రభావంతో జనం ఇబ్బందు లు పడుతున్నారు.

ఉదయంపూట కూరగాయలు, పాల వ్యాపారులు, పారిశుధ్య కార్మి కులు, పేపర్ బాయ్‌లు వణికిపో తున్నారు. చిరువ్యాపారులంతా ఉదయం చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతూనే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. చలికి తట్టుకోలేక కొంద రు చలిమంటలు కాచుకుంటున్నారు. మరోవైపు పొగమంచు కారణంగా ఉదయం వా హనాలపై వెళ్లేవారికి రోడ్డు కనిపించక ఇబ్బందులు తప్పడం లేదు.

పెరుగుతున్న చలి, పొగమంచు తీవ్రతతో ప్రజలకు ఉదయం 8 దాటితే తప్పా బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. చలి భయానికి వృద్ధులు పూర్తిగా ఇండ్లలోనే ఉంటున్నారు. పిల్లలు, వృద్ధులు ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లకపోవడమే సురక్షితం.

తప్పని పరిస్థితుల్లో తలకు మఫ్లర్ లేదా మంకీ టోపీలు, ముఖానికి మాస్కులు తప్పనిసరిగా ధరించి బయటకు వెళ్లడం మంచిది.ప్రస్తుతం ఒక మోస్తరుగా ఉన్న చలి, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

స్వెటర్లకు భలే గిరాకీ..

పలు ప్రాంతాల్లో చలి నుంచి రక్షణ పొందేందుకు కొందరు చలిమంటలు కాచుకోగా మరికొందరు పెద్దవాళ్లు, చిన్నారులు వెచ్చదనం కోసం ఉన్ని దు స్తులను ఆశ్రయిస్తున్నారు. వ్యాపారులు సాగర్ రింగ్ రోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం వచ్చే రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసి స్వెటర్లు, జాకెట్లు, మింక్ బ్లాంకెట్లు ఇతర ఉన్ని ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. దీంతో ఉన్ని దుస్తులకు విపరీత డిమాండ్ ఏర్పడింది.

జాగ్రత్తలు పాటించాలి

చలికాలంలో సాధారణంగా దగ్గు, జలుబు వస్తుంటాయి. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు మరింత జాగ్రత్తగా ఉండాలి. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాసకోస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చలితీవ్రత పెరుగుతున్నందున పిల్లలు, వృద్ధులు ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లకపోవడమే సురక్షితం. తప్పని పరిస్థితుల్లో తలకు మఫ్లర్ లేదా మంకీ టోపీలు, ముఖానికి మాస్కులు ధరించి వెళ్లాలి

డాక్టర్ రాధిక, ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్, ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి

వాహనాలు వేగంగా నడపొద్దు

తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డుపై ప్రయాణించే ద్విచక్ర, ఇతర వాహనదారులు అతివేగం మానండి. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో వచ్చి, పోయే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి.

 బొల్లం సత్యనారాయణ, సీఐ, ఇబ్రహీంపట్నం