calender_icon.png 26 January, 2026 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లా రాజకీయం!

25-01-2026 12:00:00 AM

బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో రాజకీయం వేడెక్కుతున్నది. ఫిబ్రవరి 12న ఆ దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ కొత్త రాజకీయ శక్తులు పుట్టుకొస్తున్నాయి. బంగ్లాలో అధికారంలో ఉన్న అవామీ లీగ్ పార్టీపై ఆగస్టు 2024లో యువత తిరుగుబాటు చేయడంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. యువత వ్యతిరేకతను ఆసరాగా చేసుకున్న ఇస్లామిక్ రాడికల్ శక్తులు.. హిందువులే లక్ష్యంగా దాడులు, హత్యలు చేయడంతో పాటు దేవాలయాల కూల్చివేతలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హసీనా స్థానంలో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్ దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉండడమే తప్ప చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు.

ఇదే సమయంలో బంగ్లా సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం ఖరారు కావడం, ఈసారి ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ పోటీ చేయకుండా బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. బంగ్లాదేశ్‌లో చాన్నాళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) సహా ఇతర రాజకీయ పార్టీలు భారత్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకొని అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి.

ఒకప్పుడు బంగ్లాదేశ్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా నిలబడి, రెండు దశాబ్దాలకు పైగా ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్న జమాతే ఇస్లామీ పార్టీ తాజాగా తనను తాను పునరుద్ధరించుకొని కొత్త మద్దతు కూడగడుతూ బలంగా తయారవుతున్నది. అయితే బంగ్లాదేశ్ స్వాతంత్య్రానికి అడ్డుపడిన జమాతే ఇస్లామీని షేక్ హసీనా అధికారంలోకి వచ్చాకా ఎక్కడికక్కడ అణగదొక్కే ప్రయత్నం చేశారు. యుద్ధ నేరాల విచారణకు సంబంధించిన చాలా మంది జమాతే నేతలకు మరణశిక్షలు విధించడం లేదా జైలులో పెట్టించేవారు. జమాతే ఇస్లామీ సిద్ధాంతాలు బంగ్లాదేశ్ లౌకిక రాజ్యాంగానికి విరుద్ధమని 2013లో కోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ పార్టీపై నిషేధం పడింది.

కానీ హసీనా ప్రభుత్వం పడిపోయాకా పరిణామాల్లో మార్పులు రావడంతో జమాతేపై నిషేధం ఎత్తివేశారు. ఒకవేళ బంగ్లాదేశ్‌లో జమాతే ఇస్లామీ ప్రభుత్వం ఏర్పడితే పాకిస్థాన్‌తో సన్నిహితంగా మెలిగే అవకాశముంది. ఎందుకంటే ముందు నుంచి పాక్‌తో జమాతే ఇస్లామీకి మంచి దోస్తీ ఉంది. ఇది భారత్‌ను కాస్త కలవరపెట్టే అంశం. ఎందుకంటే 1971 యుద్ధం సమయంలో జమాతే ఇస్లామీ పాకిస్థాన్ పక్షాన నిలబడి మతోన్మాదంతో రెచ్చిపోయి బంగ్లాదేశ్‌లోని మైనారిటీలను ఊచకోత కోసిందనే అభియోగాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జమాతే అధికారంలోకి వస్తే బంగ్లాలో మైనారిటీలకు భద్రతకు ముప్పుతో పాటు ఉగ్రశక్తులు పురుడు పోసుకునే ప్రమాదముందని భారత్ భావిస్తున్నది.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ బంగ్లాను తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశముంది. అమెరికా కూడా జమాతే ఇస్లామీతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు రావడంతో భారత్ అప్రమత్తంగా ఉండడం మంచిది. మరోవైపు హసీనా తొలగింపుతో యూనస్ ప్రభుత్వం ఇస్లామిక్ శక్తులతో చేతులు కలిపి వారికి మద్దతిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఇక జమాతే ఇస్లామీకి బయటి నుంచి పాకిస్థాన్ మద్దతు లభిస్తున్న వేళ బంగ్లాదేశ్‌లో ఆ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరముంది.