30-08-2025 12:00:00 AM
ముఠా గుట్టు రట్టు
మహబూబాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): నకిలీ పట్టా పాస్ పుస్తకాలతో తక్కువ విస్తీర్ణం లో ఉన్న భూమిని ఎక్కువ విస్తీర్ణంలో చూపించి బ్యాంకు ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవచ్చని రైతులకు నమ్మబలికి ఒక్కొక్కరి నుండి 10వేల రూపాయల చొప్పున వసూలు చేసి నకిలీ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి బ్యాంకులను బురిడీ కొట్టించిన ఘటనను మహబూబాబాద్ జిల్లా పోలీసులు చేదించారు.
16 నకిలీ పట్టా పాస్ పుస్తకాలు, ఒక లాప్ టాప్, రెండు ప్రింటర్లు, రెండు కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని కురవి మండలానికి చెందిన మూడ్ బాలాజీ, భానోతు హరికిషన్, జఫర్గడ్ మండలం చెందిన బానోతు వర్జన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆన్లైన్, మీసేవ పనితీరు పట్ల అవగాహన కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి తమకు పరిచయం ఉన్నవారు, బంధువులకు తమ వద్ద ఉన్న భూమికి తక్కువ బ్యాంకు రుణం ఇస్తుందని, మీ భూమిని ఎక్కువ చేసి పట్టా పాస్ పుస్తకం ఇవ్వడంతో పాటు బ్యాంకు రుణం ఎక్కువ పొందడానికి తయారుచేసి ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద పదివేల రూపాయలను తీసుకున్నారు.
మీరు ఇచ్చిన నకిలీ పాస్ పుస్తకాలతో కురవి యూనియన్ బ్యాంక్ లో ఒకరు, డోర్నకల్ యూనియన్ బ్యాంక్ లో ఆరుగురు, మహబూబాబాద్ యూనియన్ బ్యాంక్ లో ఒకరు, మహబూబాబాద్ కెనరా బ్యాంక్ లో ముగ్గురికి నకిలీ పట్టా పాస్ పుస్తకాలతో 16,90,000 రూపాయల రుణం మంజూరు అయ్యేలా సహకరించారన్నారు.
ఈ సంఘటనకు పాల్పడ్డ వారిలో మరికొందరు ఫరారిలో ఉన్నారని,ఈ ముఠాతో సంబంధం ఉన్న మిగతా వారిని కూడా అరెస్టు చేస్తామని డి.ఎస్.పి తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ సర్వయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ హత్తిరామ్ , కురవి ఎస్ ఐ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.