30-08-2025 12:00:00 AM
రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ సమీక్ష...
అదిలాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా, గ్రామ పంచాయితీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, ప్రచురణ పై అవగాహన కల్పించారు.
కలెక్టర్ మాట్లాడుతూ రాష్ర్ట ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గురువారం ఓటర్లు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రచురించడం జరిగినదని, జాబితాలో ఏమైన అభ్యంతరాలు ఉంటే ఈనెల 30వ తేదీ వరకు ఎంపీడీవో కార్యాలయం లో అభ్యంతరాలను తెలపాలని సూచించారు.
అభ్యంత రాలను స్వీకరించిన ఎంపీడీవోలు పరిశీలిం చి తగు సవరణలు చేసి జిల్లా పంచాయితీ అధికారికి సమర్పించాలని, అలాగే పోలింగ్ స్టేషన్ల జాబితా జిల్లా కలెక్టర్ కు ఆమోదం కొరకు సమర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ఆర్డీఓ స్రవంతి, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, ఫణీంద్ర, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.