30-08-2025 12:00:00 AM
భైంసా ఆగస్టు 29: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం ఆమె ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్‌తో కలిసి బైంసా పట్టణంలోని రావుల్‌నగర్, ఆటోనగర్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో అధికంగా రావడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలడం జరుగుతుందని తెలిపారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారని,;ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 91005 77132 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్, వరదల కారణంగా ఎవరూ ప్రవాహం నీటిలోకి వెళ్లకూడదని హెచ్చరించారు.
ఎన్డిఆర్‌ఎఫ్, ఎస్డిఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అనంతరం భైంసా మండలంలోని దేగామ వంతెనను కలెక్టర్, ప్రత్యేక అధికారి పరిశీలించారు. వంతెన పరిసర ప్రాంతాలలో వరద పరిస్థితులను గమనించారు. స్థానికులతో మాట్లాడుతూ వరద నీటిప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా కుంటాల మండలంలోని అందకూరు బ్రిడ్జి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరదల వల్ల వంతెనలు, రహదారులు సర్వే చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దెబ్బతిన్న చోట త్వరలోనే శాశ్వత మరమ్మత్తులు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్శనలో బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, ఆర్ అండ్ బీ డిఈ సునీల్, మున్సిపల్ కమిషనర్ రాజేష్‌కుమార్, తహసీల్దార్ ప్రవీణ్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.