calender_icon.png 15 August, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలోనే వరి ఉత్పత్తిలో బాన్సువాడ మొదటి స్థానం

15-08-2025 12:37:08 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి 

బాన్సువాడ, ఆగస్టు 14 (విజయ క్రాంతి): రాష్ట్రంలోనే వరి ఉత్పత్తిలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బుడ్మి గ్రామంలో గురువారం రూ.26 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాకోర,జలాల్‌పూర్  ప్రాంతాలకు నిజాంసాగర్ కాల్వల ద్వారా నీటిని అందించేందుకు రూ. 300 కోట్లు ఖర్చు చేసి సిద్దాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. బుడ్మి గ్రామంలోని హరిజనవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 20లక్షలు మంజూరయ్యాయన్నారు. వ్యవసాయ గోదాంలు రైతులకు ఎంతో ఉపయోగప డుతుందని, పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి రైతులకు అవకాశం కలిగిందన్నారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అన్నదాతలకు అండగా నిలుస్తాయని, రైతాంగం సంతోషంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందన్నారు. గతంలో గోదాముల కొరత వల్ల పంటలకు నష్టం వాటిల్లిన సందర్భాలున్నాయని, గోదాంల నిర్మాణాల వల్ల సమస్యలు తగ్గి రైతుల ఆదాయం పెరగడానికి తోడ్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బుడ్మి సహకార సంఘం అధ్యక్షుడు గంగుల గంగారం, ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నాందేవ్, గోపాల్ రెడ్డి, ఎజాజ్, పిట్ల శ్రీధర్, అంజిరెడ్డి, గురువినయ్, సుధాకర్ గౌడ్, ఖమ్రు, దత్తు రవి జీవన్ గోపాలకృష్ణ, వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.