28-09-2025 12:18:46 AM
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): దసరా ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మ వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏడవ రోజు వేపకాయల బతుకమ్మను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మున్సిపాలిటీలు , టీజీవోస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మహిళలు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా అధికారులు, ఉద్యోగులతో కలిసి బతుకమ్మలకు పూజ నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ ఆయన బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని, వివిధ రకాల పూలతో సాంప్రదాయబద్ధంగా, సందేశాత్మకంగా బతుకమ్మలను తయారుచేసిన మహిళా ఉద్యోగులు అభినందనీయులని ప్రశంసించారు. అలాగే ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన ‘జల్ సంచయ్ జన భాగీదారీ’ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 25 లక్షల రూపాయల నగదు బహుమానం అందుకోవడంపై కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కారణమైన మహిళా సంఘాలు, సమాఖ్యలు, అన్ని శాఖల అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
మహిళా సమాఖ్యల ప్రోత్సాహంతో పెద్దఎత్తున చేపట్టిన ఇంకుడు గుంటల నిర్మాణం వంటి చర్యల వల్లే ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చిన నగదు పురస్కారాన్ని ప్రతి శాఖ వారీగా వారి అవసరాలకు అనుగుణంగా, అభివృద్ధికి వినియోగించనున్నట్లు వెల్లడించారు. సమిష్టి కృషి ద్వారా సాధించిన ఈ విజయం జిల్లాకు గర్వకారణమని, భవిష్యత్తులో కూడా ఇలాగే అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేస్తే మరిన్ని జాతీయ స్థాయి పురస్కారాలు సాధించగలమని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద గీతాలు, మహిళల సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకోగా, బతుకమ్మ పాటలతో కలెక్టర్ కార్యాలయం మార్మోగింది.