calender_icon.png 28 September, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభయహస్తం బాండ్ పేపర్లు.. చెల్లని గవ్వలు

28-09-2025 12:47:33 AM

  1. ఎన్నికల హామీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
  2. ఇంటింటికీ వెళ్లి ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ అందజేస్తాం
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ‘అభయహస్తం’ పేరిట అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పంచిన బాండ్ పేపర్లు చెల్లని గవ్వలని ప్రజలకు అర్థమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు అభిప్రాయ పడ్డారు. అభినవ గాంధీల్లా టోపీలు పెట్టుకుని, ఇంటింటికీ వెళ్లి పంచిన గ్యారెంటీ కార్డులు ఇప్పుడు చెల్లని కార్డులయ్యాయని ఎద్దేవా చేశారు. హైదరాబా ద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన పలువురు మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలతో కలిసి ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.

పీసీసీ అధ్యక్షుడిగా నాడు రేవంత్‌రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమ లు చేస్తామని, వాటికి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేశారని మండిపడ్డారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో ప్రచారం చేయించి భంగపడ్డారని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా వారిద్దరూ స్పందించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించాలన్నారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ‘అవ్వకు కోడలికి పింఛన్ అన్నారు. రైతుకు, కౌలు రైతుకు భరోసా అన్నారు. కానీ, ఏ ఒక్క హామీనీ అమలు చేయ లేదు’ అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అయ్యారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రారంభించిన అభివృద్ధి పనులకు రిబ్బన్ కట్ చేసి, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులుగా చొప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలు చర్చించేందుకు పది రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తాము డిమాండ్ చేస్తే, కేవలం ఒక్కరోజు కాళేశ్వరం ఎత్తిపోతలపై సమావేశం పెట్టి కాంగ్రెస్ సభ్యులు పారిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలను ఏమార్చడం తప్ప, సీఎం రేవంత్ రెడ్డికి తెలిసిన విద్య ఏదీ లేదని విమర్శించారు. నాడు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికీ తిరిగి గ్యారెంటీ కార్డులను పంచిందని, నేడు బీఆర్‌ఎస్ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నదని వివరించారు.

‘ఆ బాకీలను గుర్తుచేస్తూ ‘స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీ ఇండ్ల ముందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 5 డీఏలు పెండింగ్, పీఆర్సీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ఆటో కార్మికులకు ఆర్థికసాయం అందిస్తామని తర్వాత సర్కార్ ముఖం చాటేసిందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట సాయం చేస్తామని వ్యవసాయ కూలీలను మోసం చేసిందని నిప్పులు చెరిగారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ నిలదీస్తుందని చెప్పారు.