28-09-2025 12:41:38 AM
సున్నపు రాళ్లు.. సుందరమైన కొండలకు నిలయం
పొరలు పొరలుగా ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా శిలాకృతులు.. ఎత్తయిన బండరాళ్ల మధ్య లోతైన అగాధాలతో లోయలు, అడుగడుగునా అబ్బురపరిచేలా పడగలెత్తి నిల్చున్న కొండవాళ్లు.. ఆ కొండ గోడలపై అపురూపమైన ప్రాచీన రాతి చిత్రాలు.. వీటి మధ్య ప్రయాణం ఓ అద్భుత సాహసయాత్రే. అవే పాండవుల గుట్టలు.
ప్రకతి రమణీయత.. ఆహ్లాదం.. చారిత్రాత్మక కలగలిపినవే.. పాండవుల గుట్టలు. వరంగల్ నుంచి 50 కిలోమీటర్లు, భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని ఈ పర్యాటక పాండవుల గుట్టలు వెలసి ఉన్నాయి.
వీటి చరిత్ర హిమాలయాల కన్నా పురాతరమైనవిగా గుట్టల్లో పాండవుల ఆనవాళ్ల్ళు,ఆది మానవుల గుర్తులు ,అందమైన అడవి.. సున్నపు రాళ్లు, అవక్షేపక శిలలతో అలుముకుని ఉన్నాయి. ఈ పాండవుల గుహలు సాహసంతో కూడి ఉంటాయి. సుమారు 3500 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ అటవీ ప్రాంతం దాని ప్రయాణం ఎంతో సాహసంగా ఉంటుంది.
పాండవుల జాడలు.. ఆదిమానవుల గుర్తులు
ఆనాటి కాలంలో ఇక్కడ పాండవులు పర్యటించారని దీంతో ఈ గుట్టలకు పాండవుల గుట్ట అనే పేరు వచ్చిందని అంటారు. ఈ కొండల్లో ఎదురు పాండవులు, పోతరాజు చెలిమె, మేకల బండ, ముంగిస బండ, తుపాకుల గుండు, గొంతెమ్మ గుహ, శ్రీకృష్ణుని పాదాలు, భీముని అడుగులు, భీముని గుండు, యానాదుల గుహ,పాండవులు ఆడిన ప్రదేశాలు ఉంటాయి.
నాటి జీవనశైలి వైవిధ్యాన్ని తెలిపేలా..
అలాగే కొన్ని కొండలపై అద్భుతమైన శిలా చిత్రాలు ఉన్నాయి. ప్రాక్ యుగం నుంచి చారిత్రక యుగం దాకా వేయబడిన రాతి చిత్రాలను అప్పటి జీవనశైలి వైవిధ్యాన్ని కనువిందు చేస్తాయి. కొన్నిచోట్ల పాతబొమ్మల మీదనే కొత్త బొమ్మలు వేసిన జాడలు కనిపిస్తాయి. ఆరు చోట్ల ఉన్న చిత్ర శిలాశ్రయాల్లో అన్ని ముదురు ఎరుపు రంగుతో చిత్రించబడ్డవే. మందమైన గీతలతో చదునైన పూతలతో గీయబడిన ఈ బొమ్మల్లో శాఖాహార, మాంసాహార జీవులు, మనుషుల బొమ్మలు ఉన్నాయి.
వీటిలో జింకలు, చేపలు, మేకలు, కుక్కలు, ముళ్ల పందులు, కుందేళ్లు, తాబేలు, పాము, చిలుక, సీతాకోకచిలుకలు, కొండెంగ, నెమలి, కప్ప, బల్లి, ఎలుగుబంటి, పెద్ద పులులు, వాళ్లతో మనుషులు, పులి వంటి జంతువులు చంపిన సరిసృపం వంటి పెద్ద జంతువు, కుందేలను తరుముతున్న కుక్కలు, కుక్కలు చుట్టి నిల్చున్న మనిషి, త్రిభుజాలు, త్రిశూలం, చుక్కల వంటి రేఖా కృతులు, కొన్ని శిధిల చిత్రాలు, ఇవే కాక గొంతెమ్మ గుహలో చేతి గుర్తులు, యుద్ధం చేస్తున్న వీరుల బొమ్మలు ఉన్నాయి.
పాండవుల గుహలో రంగులలో పంచపాండవులు, కుంతీ, ద్రౌపది, దృపదుడు, పాండవుల పెండ్లి, శేష శాయి, గణేషుడు, శివలింగం, ఆంజనేయుడు, బ్రహ్మ, సరస్వతి చిత్రాలు ఉన్నాయి. పాండవుల గుట్ట మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రాంతం, పురాతన విషయాలను మరింత తెలుసుకునే విధంగా ఎంతో రహస్య ప్రదేశంగా ఉంటుంది. ఆనందానికి, విజ్ఞానానికి నిలయంగా ఉంటుంది.
రేగొండ, విజయక్రాంతి