28-09-2025 12:51:58 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): 2000 సంవత్సరం ఆగస్టు 24 అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఆకాశం భయంకరమైన మబ్బులతో నిండిపోయింది. నల్లటి మబ్బులు గుట్టుచప్పుడు కాకుండా చేరి గర్భంలో కోపాన్ని మోసుకొచ్చాయి. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆ నిశబ్దం వెనుక తుఫాను దాగి ఉందని జనాలకు తెలియదు. ఆకాశం చీలినట్టు వరణుడు ఉగ్రరూపం దాల్చాడు.
ఇండ్ల పైకప్పులపై మృత్యు డప్పులు మోగుతున్న తీరు మోత వినిపించింది. నగర చరిత్రలోనే ఏకంగా 24 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. గంటల వ్యవధిలోనే నగర వీధులు నదుల్లా మారాయి. మూసీ నది శరీరంలోని వరద ఉప్పొంగి.. ఏకంగా దేహాన్ని దాటేసింది. హైదరాబాద్ చరిత్రలో ఒక్కరోజే 24 సెంటీమీటర్ల వర్షం కురవడం అదే తొలిసారి. నాటి ఘటనలో ఎక్కువగా బేగంపేట, బేగంబజార్, ఆఫ్జల్‌గంజ్ తదితర ప్రాంతాలు ప్రభావితమయ్యా యి.
ఇండ్లలోకి నెమ్మదిగా నీరు ప్రవేశించి, క్షణాల్లోనే మంచాలు, కుర్చీలతో పాటు జ్ఞాపకాలను తుడిచిపెట్టేసింది. తలుపులు కొట్టుకుపోయాయి. గోడలు కూలిపోయా యి. పిల్లలను చేతబట్టుకొని మోకాల లోతు నీటిలో తల్లిదండ్రులు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. గాఢాంధకారంలో కేకలు వినిపించాయి. నీరు నడుము ఎత్తుకు చేరి.. క్షణా ల్లోనే నడుములను దాటేసింది. పుస్తకాలు, బట్టలు అన్ని వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
బయటకు వెళ్లే మార్గంలేక.. లోపలే కూర్చొనే ధైర్యం లేక ప్రతీక్షణం భయంభయంగా గడిపారు. నాటి ఘటన జరిగి 25 ఏండ్లు గడిచినా హైదరాబాద్ గుణపాఠం నేర్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో నీటి ప్రవాహ మార్గాలు ఇంకా బందీలుగానే ఉన్నాయన్నది వాస్తవ సత్యం. నాలాలు అంచులు కదలకుండా ఇంకా ఆక్రమణలతో మునిగిపోయాయి. వీటి మీద అనేక ఇండ్లను నిర్మించారు.
2020లోనూ జలదిగ్భంధం..
2020లో కరోనా మహమ్మారితో పాటు హైదరాబాదీలు మరో మరిచిపోలేని చేదు జ్ఞాపకాన్ని ఎదుర్కొన్నారు. 2020, అక్టోబర్ 14న వరదలు భాగ్యనగరాన్ని ముంచెత్తాయి. నగర వాసులంతా నిరాశ్రయులై చిగురుటాకుల్లా వణికిపోయారు. 400 సుదీర్ఘ చరిత్రతో దేశంలోనే రెండో మెట్రోపాలిటన్ నగరంగా పేరొందిన హైదరాబాద్ వరదలతో అల్లలాడిపోయింది. వేలాది కాలనీలు నీట మునగగా, ద్విచక్రవాహనాలు, కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి.
అధికారుల లెక్కల ప్రకారం వరదల దాటికి 98 మంది నీటిలో కొట్టుకుపోయారు. 360 జాతీయ విపత్తు దళాలు, భారత సైన్యం దళాలను రంగంలోకి దించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినా ఫలితం మాత్రం అంతంత మాత్రమే. ఈ వరదల కారణంగా దాదాపు 5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనావేశారు.
రాష్ట్రంలో వరద పరిస్థితులను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపించారు. 2023లోనూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో వరదలు సంభవించాయి. అనేక కాలనీలు జలదిగ్భంధమయ్యాయి. కానీ వరద నియంత్రణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వచ్చాయి.
అదే పునరావృతం..
ఈ ఏడాది సైతం భాగ్యనగరంపై వరణుడు కన్నెరజేశాడు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు మూసీనదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతా లు జలమయమ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. నగరంలోని ప్రధాన ప్రయాణప్రాంగణమైన ఎంజీబీఎస్‌లోకి వరద నీరు చేరడంతో అధికారులు దాన్ని మూసేశారు.
అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మూసీ పరీవాహక ప్రాం తంలో వరద నీటి ఉధృతి పెరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా గుణపాఠం నేర్చి, వరద నీటిని మళ్లించేందుకు సరైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.