28-09-2025 12:42:09 AM
-గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
-రసూల్‌పురాలో 344 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభం
-హాజరైన ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని ఇరుకైన ఇళ్లలో, గుడిసెల్లో మగ్గుతున్న వారికి వారు నివసించే ప్రాంతంలోనే అపార్ట్‌మెంట్ తరహాలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిం చి ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్‌పురాలో రూ.22.32 కోట్ల వ్యయంతో నిర్మిం చిన 288 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను శనివారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్‌లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మొత్తం 344 మంది లబ్ధిదారులకు రసూల్‌పురాలో 288, తిరుమలగిరి గాంధీనగర్‌లో 47, శ్రీరామ్‌నగర్‌లో 9 ఇళ్ల పట్టాల ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. “సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు నగరంలో 30 నుంచి 70 గజాల స్థలంలో నివసించే పేదలకు వారు ఉంటున్న చోటే అపార్ట్‌మెంట్ తరహాలో ఇళ్లు నిర్మించి ఇస్తాం. దీనికి సంబం ధించిన తీయటి కబురు త్వరలోనే చెపు తాం” అని స్పష్టం చేశారు. ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీగణేష్‌ల విజ్ఞప్తి మేరకు, వాజ్‌పేయి కాలనీలో మొండి గోడలతో ఆగిపోయిన ఇళ్లను వెంట నే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.
కంటోన్మెంట్ పరిధిలోని భూములను ఫ్రీహోల్డ్ చేసేందుకు, ఆధునిక శ్మశానవాటిక నిర్మాణానికి అవసరమైన అనుమతులను కేంద్రం నుంచి తీసుకురావాలని ఎంపీ ఈటలకు మంత్రి సూచించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి రాజకీయాలు ఉండవని, గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో ఆగిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తిచేసి పేదలకు అందించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.