28-09-2025 12:44:25 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి) : పర్యాటకాభివృద్ధి పేరిట కమీషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుంభకోణానికి తెరలేపిందని మాజీమంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ సర్కార్ అవినీతి అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆయన ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. ఏకంగా రూ.15వేల కోట్ల పనులు అప్పనం గా అప్పగించారని ఆరోపించారు.
లక్షల కోట్లు విలువ చేసే వేలాది ఎకరాల భూములను తన అనుయాయులకు ధారాదత్తం చేసేందుకు రేవంత్‌రెడ్డి భారీ స్కెచ్ వేశారని తెలిపారు. ఓపెన్ బిడ్లు పిలవలేదు, అధికంగా బిడ్ దాఖలు చేసిన వారికి పనులు అప్పగించాల్సి ఉన్నా ఎక్కడా నిబంధనలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కుంభకోణానికి సంబంధించి పూర్తి ఆధారాలు బయటపెడతామని తెలిపారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి అధికారం శాశ్వతం కాదు.. వచ్చేది బీఆర్‌ఎస్ సర్కార్’ అని పేర్కొన్నారు. ఈ దోపిడీలో భాగమైన ఏ ఒక్కరినీ వదిలిబెట్టబోమని హెచ్చరించారు.
నిర్లక్ష్యంతోనే హైదరాబాద్ జల దిగ్బంధం
కాంగ్రెస్ పాలన నిర్లక్ష్యం కారణంగానే హైదరాబాద్ జల దిగ్బంధంలో ఉందని హరీశ్‌రావు తెలిపారు. భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించకపోవడం దుర్మార్గం.. అని మండిపడ్డారు. వరద అంచనా వేయడంలో...ప్రణాళికలు రూపొందించడంలో.. పభుత్వం విభాగాలను సమన్వయ పరచడంలో సర్కార్ వైఫల్యం చెందిందని విమర్శించారు.