19-09-2025 01:13:05 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): బతుకమ్మ.. పూల పండగ మాత్రమే కాదని, ఆడబిడ్డలను గౌరవించుకునే పండగ అని, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 31 వరకు రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. గిన్నిస్‌బుక్ రికార్డులో చేరేలా రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు ఉంటాయని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
21వ తేదీన వరంగల్‌లోని వేయి స్థంభాల గుడి వద్ద బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. గురు వారం మంత్రి జూపల్లి గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మా జీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, పార్టీ మహిళా నేతలు ఇందిరా శోభన్, సరితా తిరుపతయ్య యాదవ్, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతతో కలిసి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామా ల్లో నిర్వహించే వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటాలని మంత్రి సూచించారు. బతుకమ్మ పాటల కోసం కవులు, రచయితలతోనూ చర్చించామన్నారు. విమానాశ్రయ మంలో కూడా తెలంగాణ సంస్కృతిని తెలిపేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ..
కాంగ్రెస్ శ్రేణులు ఎంగిలిపువ్వుల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని సూచించారు. కొందరు కావాలనే బతుకమ్మను రాజకీయం చేయడం సరికాదని, పార్టీలకు అతీతంగా ప్రతీఒక్కరు పాల్గొనాలని కోరారు. బతుకమ్మ కోసమే బతుకమ్మ కుంట మళ్లీ వచ్చిందని, బతుకమ్మ కుంటను కాపాడటంలో సీఎం రేవంత్‌రెడ్డి, వీహెచ్ పాత్ర కీలకమని పేర్కొన్నారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు మాట్లాడుతూ అంబర్‌పేటలో కబ్జా చేసిన బతుకమ్మ కుంటను తమ ప్రభుత్వం వచ్చాక స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బతుకమ్మ కుంట ను కాపాడిన సీఎం రేవంత్‌రెడ్డికి, హైడ్రాకు వీహెచ్ అభినందనలు తెలిపారు. కవిత ఎక్కడో విదేశాల్లో ఆడుతుందని, కానీ బతుకమ్మ కుంటకు రాలేదని ఆయన విమర్శించారు.