15-09-2025 07:21:14 PM
ఈనెల 21న వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ ప్రారంభోత్సవ వేడుకలు
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఉన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలు లో వివిధ శాఖల అధికారులు, వేద పండితులతో బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేయాల్సిన బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, పద్మాక్షి, వెయ్యి స్తంభాల దేవాలయాల ప్రధానార్చకులు శంకర శాస్త్రి, గంగు ఉపేంద్ర శర్మ, పోలీస్ శాఖ నుండి హనుమకొండ ఏసిపి నరసింహారావు, వైద్య ఆరోగ్యశాఖ నుండి డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, విద్యుత్ శాఖ నుండి ఎస్ఈ మధుసూదన్, ఆర్ అండ్ బి శాఖ నుండి ఈఈ సురేష్ బాబు తమ తమ శాఖల తరపున చేసే ఏర్పాట్లను వివరించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయని, అదే రోజున జిల్లాలోని చారిత్రక వెయ్యి స్తంభాల దేవాలయం వద్ద ఘనంగా బతుకమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్తు లైట్లు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.
మహిళలు అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొంటారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో మహిళా పోలీసులను బందోబస్తుకు కేటాయించాలన్నారు. అదేవిధంగా తాగునీరు అందుబాటులో ఉండే విధంగా మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాలలో కూడా బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరగనున్న ఆలయాల వద్ద ప్రశాంతంగా సాగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.