26-11-2025 12:11:48 AM
రెండు, మూడు రోజుల్లో ప్రారంభం : సింగరేణి సీఎండీ బలరామ్
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): పగటిపూట ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్తును పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా.. బ్యాటరీ లో నిలువ చేసుకుని, అవసరమైనప్పుడు వాడుకునేలా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్‌ఎస్)ను రాష్ట్రంలోనే మొదటి సారిగా సింగరేణి సంస్థ ఏర్పాటు చేయనున్నదని దాని సీఎండీ బలరామ్ తెలిపారు. మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్‌కు అనుబంధంగా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ ఎస్)ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
ఒక మెగావాట్ సామర్థ్యంతో ఉన్న ఈ బీఈఎస్‌ఎస్ వ్యవస్థను రెండు, మూడు రోజుల్లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తు ఉత్పత్తికి అందిస్తున్న ప్రోత్సాహంతో సింగరేణి సంస్థ తన ఏరియాల్లో సుమారు 245.5 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లను ఏర్పాటు చేసిందని తెలిపారు.
సింగరేణిలో డిమాండ్ లేని సమయాల్లో ఉత్పత్తి అవుతున్న సౌర విద్యుత్తును గ్రిడ్‌కు ఉచితంగా సరఫరా చేయాల్సి వస్తోంది. ఇలా మిగిలిపోయిన సౌర విద్యుత్తును పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ద్వారా నిల్వచేసి డిమాండ్ ఉన్నప్పుడు కంపెనీ అవసరాలకు వినియోగించుకునేలా ఈ బీఈఎస్‌ఎస్‌ను రూపొందించారని వివరించారు. ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు 250 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంను ఏర్పాటు చేయాలని సంకల్పించిందని తెలిపారు.