26-11-2025 12:13:05 AM
సామినేని హంతకుల అరెస్టు చేయాలని డిమాండ్
ఖమ్మం, నవంబరు 25 (విజయక్రాంతి): సీపీఎం రాష్ట్ర నాయకులు, చింత కాని మండలం పాతర్లపాడు మాజీ సర్పం చ్ సామినేని రామారావు హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆ పార్టీ మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాటలో పలువురు కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ధర్నాకు బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు సైతం మద్దతు ప్రకటించాయి.ఉపముఖ్యమంత్రి మల్లు భటి విక్రమార్క, ఆయన సతీమణి నందినికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
అధికారపార్టీకి పోలీసులు గులాంగిరీ చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ధ్వజమెత్తారు.సీపీఎం నాయకున్ని హత్యచేస్తే ఆ పార్టీ నాయకులు అడక్కపోతే ఎవరడుగుతారని పోలీసు కమిషనర్ సునీల్‌దత్త్‌ను ప్రశ్నించారు. ఇదీ ముమ్మాటికీ రాజకీయ హత్య అన్నారు. రామారావు కుటుంబానికి న్యాయం జరిగే వరకూ సీపీని, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
పోలీసు విచారణ అత్యంత హాస్యాస్పదంగా సాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. మధిర నియోజకవర్గంలో జరుగుతున్న దురాఘతాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టిసారించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమలరాజ్ ధర్నాలో సామినేని రామారావు సతీమణి స్వరాజ్యం, కుమారుడు విజయ్‌లు పాల్గొన్నారు.