24-10-2025 12:26:03 AM
బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
ఖైరతాబాద్, అక్టోబర్ 23 (విజయ క్రాంతి) : బీసీ బిల్లును వెంటనే ఆమోదించాలని లేనిపక్షంలో గవర్నర్ తన పదవికి రాజీ నామా చేయాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూలులో చేర్చాలనే డిమాండుతో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చలో రాజభవన్ కార్య క్రమం నిర్వహించారు.
పెద్ద ఎత్తున రాజ్ భవన్ ముట్టడికి బయల్దేరిన నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భం గా రాచాల మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను గవర్నర్ తన వద్దనే ఉంచుకుని సంతకం చేయకుండా ఆలస్యం చేస్తున్నారని, గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లా వ్యవహరిస్తూ బీసీల హక్కులను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం అని ఆరోపించారు.
ధర్నా అనంతరం నాయకులు గవర్నర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ మేధావుల ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ఓబీసీ స్టూడెం ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు జి. కిరణ్ కుమార్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్, ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జి గణేష్, తదితరులు పాల్గొన్నారు.