29-11-2025 12:35:36 AM
ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): రాష్ర్టంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసి, గెలచి తమ సత్తా చాటాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని విమర్శించారు. హైకోరు, నిధుల విడుదల సాకుగా చూపించి రేవంత్‌రెడ్డి సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారని మండిపడ్డారు. కనీసం 22 శాతం రిజర్వేషన్లను అమలు చేయడంలోనూ కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టంలోని అనేక జిల్లాలలో బీసీలకు దక్కాల్సిన కనీసం 22 శాతం సర్పంచ్ సీట్లు కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అన్ని జనరల్ స్థానాలలో బీసీలు పోటీ చేసి గెలవాలని సూచించారు. ఆ దిశగా తెలంగాణ రాష్ర్టంలోని బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో 50 శాతం పైనే ఉన్న బీసీలకు రాజకీయ రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ సర్పం చులుగా గెలవాలని, ప్రభుత్వానకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.