calender_icon.png 29 November, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

29-11-2025 12:34:33 AM

  1. భూ మార్పిడికి రైతు నుంచి రూ.25 వేలు డిమాండ్

రూ.15 వేలు లంచం తీసుకుంటూ.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్ మహేందర్

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో ఘటన

మహబూబాబాద్, నవంబర్ 28(విజయక్రాంతి): భూమి పేరు మార్పిడి కోసం ఓ రైతు నుంచి రూ.25 వేలు డిమాండ్ చేసి, రూ.15 వేల లంచం తీసుకుంటున్న తహసీల్దార్ మహేందర్‌ను ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలలో శుక్రవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవంగర మండలంలోని పోచంపల్లి గ్రామం పడమటి తండాకు చెందిన ఓ రైతు మరణించాడు.

ఆయన కుమారుడు చనిపోయిన తండ్రి పేరు మీద ఉన్న 3:09 ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరు మీదికి మార్చడం కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు తహసీల్దార్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ద్వారా విచారణకు ఆదేశించారు. రిపోర్టుతో పాటు మృతిచెందిన రైతు రక్త సంబంధీకులతో స్టేట్‌మెంట్ తీసుకొని రైతు కుమారుడి పేరు మీద భూమి మార్చకుండా ఫైల్ తొక్కి పెట్టాడు.

నిబంధనల ప్రకారం అన్నీ సమర్పించినప్పటికీ దాటవేస్తుండడంతో తహసీల్దార్ మహేందర్‌ను పలుమార్లు రైతు ప్రాధేయపడ్డాడు. ‘రూ.25 వేలు ఇస్తే తప్ప నీ పేరు మీద భూమి చేయను’ అని చెప్పడంతో చివరకు రూ.15 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు.

లంచం ఇవ్వడానికి ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శుక్రవారం రూ.15 వేలు బాధితుడి నుంచి డ్రైవర్ గౌతమ్ ద్వారా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికారు. రెవెన్యూ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అనంతరం తహసీల్దార్ మహేందర్‌ను అదుపులోకి తీసుకుని, ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.