calender_icon.png 24 October, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుర్తి లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

23-10-2025 11:23:56 PM

కల్వకుర్తి టౌన్: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని భారత్ లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మృతుడి కుటుంబ సభ్యులు అతని మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ-2 రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, కోడేరు మండలం తీగలపల్లి గ్రామానికి చెందిన గోపాల మల్లయ్య(45) లాడ్జి గదిలో విగతజీవిగా పడి ఉన్నాడు.

రెండేళ్ల క్రితం భార్య చనిపోవడంతో అప్పటి నుంచి అతను ఒంటరిగా జీవిస్తూ, బయట పనులు చేసుకుంటున్నట్లు తెలిసింది. మల్లయ్య మరణవార్త తెలుసుకున్న అతని సోదరుడు గోపాల లింగం, తన తమ్ముడిది సహజ మరణం కాదని, దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తమ్ముడి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లింగం ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల కారణాలు స్పష్టమవుతాయని ఆయన పేర్కొన్నారు.