05-12-2025 12:34:37 AM
చలికాలంలో అధిక పొగమంచు పొంచి ఉన్నప్రమాదాలు
మహబూబాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): చలికాలంలో పొగ మంచుతో రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. పొగ మంచు దట్టంగా అలుముకోవడం వల్ల ప్రధానంగా ఉదయం పూట ఎదురుగా వచ్చే వాహనాలు, ముందు వెళ్లే వాహనాలు తీరా దగ్గరికి వచ్చేంతవరకు కనిపించకపోవడంతో పరస్పరం వాహనాలు ఢీకొని ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ప్రమాదాల వల్ల గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పొగ మంచు వల్ల ప్రమాదాలు చోటుచేసుకోకుండా వాహనాలకు నిరంతరం హెడ్ లైట్ వెలిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఆదేశాల మేరకు వాహనాల తయారీ కంపెనీలు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాయి. అయితే మంచు తీవ్రత ఇటీవల అధికంగా ఉండడంతో కనీసం ఆరడుగుల దూరంలో ఉన్న వాహనం లేదంటే దారి సక్రమంగా కనిపించే పరిస్థితి లేకుండా పోతోంది.
వాహన యజమానులు పొగ మంచు తీవ్రత నేపథ్యంలో ఈ చలికాలం పూర్తిగా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. పొగమంచు వలన రోడ్డు, వాహనాలు, పాదచారులు, జంతువులు, సిగ్నల్స్ సరిగ్గా కనిపించవు. ఈ కాలంలో డ్రైవర్లు ముందు ఉన్న వాహనాలు, ఆగి ఉన్న వాహనాలు ఎంత దూరం ఉన్నాయో అంచనావేయడం కష్టం అవుతుంది.
ఈ చలి కాలంలో డ్రైవర్లు ఈ క్రింద తెలిపిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు. గమ్యస్థానానికి వెళ్ళవలసిన క్రమంలో కొద్దిగా ముందుగానే బయలుదేరండి. పొగమంచు వలన ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది కనుక ముందుగా బయలుదేరితే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తొందరగా వెళ్ళాలనే ఆలోచనను నివారించవచ్చన్నారు. అతివేగాన్ని, ఓవర్ టేకింగ్ నివారించండి.
ముందుగా ఉన్న వాహనాలు, రోడ్డ్డు కనిపించకపోవడం వలన, వేగంగా వెళ్ళడం వలన వాహనం కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంచి ఉంటుందని, ఓవర్ టేకింగ్ వలన ముందున్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనావేయడం కష్టంగా మారుతుందన్నారు. పొగ మంచు అధికంగా ఉన్న సమయంలో వాహనానికిలోబీమ్ లైట్లను వాడాలన్నారు. పొగ మంచు వలన హై బీమ్ లైట్ల నుండి వచ్చే కాంతి విచ్ఛిన్నమై ముందు చూడడం కష్టం అవుతుందన్నారు.
లోబీమ్ లైట్లు ఉండటం వలన వెనుక లైట్లు, మిగతా వాహనదారులకు క్లియర్ గా మీ వాహనం ఎంత దూరంలో ఉందో తెలుస్తుందన్నారు. ఫాగ్ లైట్లు ఉన్న యెడల, వాటిని వినియోగించాలని సూచించారు. ముందు ఉన్న వాహనానికి మీ వాహనానికి మధ్య సురక్షిత దూరాన్ని పాటించాలని, దాని వలన ముందున్న వాహనం సడన్ బ్రేక్ వేసినా, వాహనం ఎక్కడ ఉందో అంచనా వేయడంలో తప్పు జరిగినా, ముందున్న వాహనాన్ని ఢీకొట్టడాన్ని నివారించవచ్చన్నారు.
నిర్దేశించబడిన లైన్లలో వాహనాన్ని నడపాలని, ఇష్టం వచ్చినట్లు లేన్ క్రమశిక్షణ లేకుండా నడపడం వలన ముందున్న వాహనాలను గుర్తించడం కష్టం అవుతుందన్నారు.వాహనాన్నినడిపేటప్పుడు కొద్దిగా కిటికీ అద్దాలను దించడంవలన పొగమంచు ఒకేదగ్గర కేంద్రీకృతం కాకుండా విచ్ఛిన్నం అవుతుందన్నారు. దాని వలన డ్రైవర్ దృష్టి మెరుగు పడుతుందని,కొన్నిసార్లు పొగమంచు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో కాసేపు వాహనాన్ని ఆపి మరల వాహనాన్ని నడపాలని సూచించారు. పొగ మంచు దక్తంగా ఉంటే ముందు ఉన్న వాహనాలు, రోడ్డు సరిగ్గా కనిపించకపోతే వాహనాన్ని నడపవద్దన్నారు.
ముందున్న వాహనం ఎంతదూరం ఉందో అంచనా వేయడం కష్టంగా ఉన్నా, వాహనానికి ముందు కిటికీ అద్దాలను వెనుక ఉన్న అద్దాలను శుభ్రంగా ఉంచాలని, వాహనం యొక్క వైపర్లను, డీప్రాస్టర్లను అవసరాన్ని బట్టి వాడుతూ అద్దాలను క్లియర్ చేసుకోవాలన్నారు. ముందుగా ఇన్డికేటర్లను ఉపయోగించాలని తద్వారా ఎటువైపు వెళుతున్నారో వెనుక వచ్చే వాహనానికి ముందుగా తెలిసి జాగ్రత్త పడే అవకాశం ఉంటుందన్నారు.
సడన్ బ్రేకింగ్ వేయడాన్ని నివారించాలని, చలికాలంలో రోడ్డు తడిగా ఉండటంవలన వాహనాలు స్కిడ్ అవడం స్లిప్ అవ్వడం జరిగి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని, సరైన రోడ్డు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం వాహనాలను నడిపి ప్రమాదాలను వివరించాలని వాహన డ్రైవర్లను, యజమానులను ఎస్పి కోరారు.