10-01-2026 06:57:47 PM
- టిజీ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రమేష్ బాబు
కరీంనగర్,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం ఒక సంప్రదాయమని, అయితే ఈ వేడుకల్లో విద్యుత్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ ఎస్ఈ రమేష్ బాబు తెలిపారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో పతంగులు ఎగురవేయడం వల్ల ప్రాణాపాయంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. గాలిపటాలను కేవలం ఖాళీ ప్రదేశాల్లో, మైదానాల్లో మాత్రమే ఎగురవేయాలని, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల వద్ద పతంగులు ఎగురవేయడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు.
పక్షులకు, మనుషులకు హాని చేసే, విద్యుత్ వాహకత కలిగిన 'చైనా మాంజా'ను అస్సలు వాడవద్దని, ఇది తెగకపోవడమే కాకుండా లైన్లు బ్రేక్ డౌన్ అవ్వడానికి కారణమవుతుందని తెలిపారు. గాలిపటం విద్యుత్ తీగలకు చిక్కుకుంటే, దానిని కర్రలతో లేదా ఇనుప పైపులతో తొలగించే ప్రయత్నం అస్సలు చేయవద్దని, దానిని లాగడం వల్ల తీగలు ఒకదానికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. వినియోగదారుల శ్రేయస్సు కోసమే విద్యుత్ శాఖ నిరంతరం పనిచేస్తోందని, విద్యుత్ నిబంధనలు పాటించి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.