29-01-2026 12:08:52 AM
జనరల్ అబ్జర్వర్ మయాంక్ మిట్టల్
రంగారెడ్డి, జనవరి 28 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని జనరల్ అబ్జర్వర్ మయాంక్ మిట్టల్ (IAS) ఆదేశించారు. బుధవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నామినేషన్ల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. అభ్యర్థులు సమర్పించే నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే స్వీకరించాలన్నారు. దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను విధిగా రిజిస్టర్లో నమోదు చేయాలి, దాఖలైన నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి నివేదించాలని చెప్పారు. ప్రతి కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా అభ్యర్థులకు అవసరమైన సాంకేతిక సహకారం అందించా లన్నారు.
నిబంధనల అమలులో రాజీ వద్దు
జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని అధికారులను కోరారు. అభ్యర్థులు జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాల విషయంలో స్పష్టత ఇవ్వాలని, ఏవైనా సందేహాలు ఉంటే సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Code of Conduct) పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి మరియు ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.