15-08-2025 12:15:35 AM
-15 ఏండ్లుగా ఎదురుచూస్తున్న వికలాంగుడు
-అధికారుల తీరుతో మరోసారి చేజారిన వైనం
-విజయక్రాంతితో చెబుతూ కంటతడి పెట్టుకున్న వికలాంగుడి కుటుంబం
-ఇల్లు ఇప్పించాలని వేడుకోలు
గరిడేపల్లి,ఆగస్టు 14 : రాష్ట్రంలోని ఏ పేదవాడికైనా ఉండేందుకు ఇల్లు, తినేందుకు తిండికి కొదవ ఉండొద్దన్న లక్ష్యంతోనే ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలను అమలు అమలు చేస్తుంటాయి. దానిలో భాగంగానే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ గృహం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ పథకం అమలులో అధికారుల తీరు కొందరు అర్హులైన పేదలకు శాపంగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఘటనే అందుకు మంచి ఉదాహరణ.
వివరాలలోకి వెళితే.. గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన కొమర్రాజు నరసింహారావు దివ్యాంగుడు. వయసు 45 సంవత్సరాలు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా పిర్యాదులు రాసి కుటుంబంను నడిపేవాడు. 81 చదరపు గజాల ఖాళీ జాగా మాత్రమే ఉంది. సొంత ఇల్లు కూడా లేని నిరుపేద. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఇతనికి గతంలో నల్గొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో ఇంటికే పరిమితమయ్యాడు.
అసలే పోలియో కారణంతో చేయి పనిచేయకపోగా ప్రస్తుతం కాలు కూడా విరగడంతో ఆయన పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇల్లు గడవని స్థితిలో ఉన్న కుటుంబాన్నీ అతని భార్య తన భుజస్కంధాలపై వేసుకుంది. కూలి, నాలి చేసి తన ఇద్దరు పిల్లలని చదివిస్తూ... అతనికి వచ్చే పెన్షన్ రూ.4 వేలతో కష్ట, కష్టంగా ఆమె కుటుంబాన్ని నెట్టకొస్తుంది. ఈ క్రమంలో ఎలాగైనా తన సొంతింటి కలను నిజం చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రజా పాలనలో ఇందిరమ్మ గృహం పథకంకు తన భార్య రమణ పేరుపై దరఖాస్తు చేసుకున్నాడు.15 సంవత్సరాలుగా ఒక కిరాయి ఇంట్లో ఉంటున్న నరసింహారావు ఇక ఈసారి తన కల నెరవేరబోతుందని సంతోషపడుతూ ఎదురు చూశాడు.
కానీ అధికారుల తీరుతో ఆ ఆశ కూడా గల్లంతయింది. రూ.1500 కిరాయి చెల్లిస్తూ ఒక అద్దె ఇంట్లో (ఒకే గదిలో) ఉంటుండగా సర్వే కొచ్చిన అధికారులు ఫోటో తీసి రికార్డులో రెంట్ హౌస్ అని పంపించినప్పటికీ ఎల్ 3 రికార్డులో బిల్డింగ్ అని నమోదు కావడంతో అతనికి ఇందిరమ్మ ఇల్లు మంజూరీ కాలేదంటూ కన్నీటి పర్యంతం అయింది ఆ కుటుంబం. అధికారుల నిర్లక్ష్యానికి తోడు స్లాబ్ గదిలో కిరాయికి ఉండుటం కూడా ఒక శాపంగా మారిందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉండడంతో పాటు ఓ వికలాంగుడనైన నాకు జిల్లా మంత్రి ఉత్తమ్, కలెక్టర్ సార్ లు తమపై దయ తలచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు వేడుకుంటున్నారు.