15-08-2025 12:18:38 AM
ఆగ్రోస్ కేంద్రాల వద్ద ప్రతిరోజు పడిగాపులే
పట్టించుకోని పాలకులు, అధికారులు
రైతుల మధ్య మనస్పర్దాలకు దారి
నంగునూరు, ఆగస్టు 14: పంటల సాగు ప్రారంభం నుంచే రైతులు ఎరువుల కోసం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల సహకార కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ప్రతి రోజు భారీగా సంఖ్యలో బారులు తీరుతున్నారు.
నంగునూరు మండలంలో గత వానాకాలంలో 25,878 ఎకరాల్లో సాగు చేయగా, అప్పట్లో 2600 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యింది. కానీ, ఈసారి 25,750 ఎకరాలకు సాగు అంచనా వేసి, 1800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అయితే, ఇప్పటివరకు కేవలం 1100 మెట్రిక్ టన్నులు మాత్రమే నంగునూరు మండల కేంద్రానికి సరఫరా అయ్యింది.
యూరియా సరఫరాలో ఎంత జాప్యం జరుగుతోందో స్పష్టమవుతోంది. రైతులకు సరిపడా యూరియాను సకాలంలో అందించకుండా, నిబంధనలతో ఇబ్బందులకు గురిచేయడంపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
నంగునూరు మండలంలో రైతులు యూరియా కోసం పడుతున్న పాట్లు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో యూరియా పంపిణీ ఇంతటి గందరగోళానికి దారితీయలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం రైతుల అవసరాలను గుర్తించి, యూరియాను నేరుగా ఇంటికే సరఫరా చేసేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకపోవడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఓటీపీ విధానంతో సమస్యలు
యూరియా పంపిణీలో ప్రభుత్వం ఓటీపీ విధానం మాకు తలనొప్పిగా మారింది. బస్తాలు మాకు నేరుగా ఇవ్వకుండా, ఓటీపీ విధానం ద్వారా ఇస్తున్నారు. ఒక్కరికి సుమారు 20 నిమిషాల సమయం పడుతుంది. చాలా సందర్భాల్లో సర్వర్ పనిచేయకపోవడం వల్ల గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. ఓటిపి విధానం తక్షణమే రద్దు చేయాలి.
పిల్లి కలవ్వ, రైతు, కోనాయిపల్లి.
గతంలోనే బాగుండే...
గడిచిన 10 సంవత్సరాలలో పొలం పనులు వదిలి ఎరువుల కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఏ ఇబ్బంది లేకుండా సకాలంలో యూరియా దొరికేది, అందుకే పంటలు కూడా మంచిగ పండేవి. యూరియా మస్తుగ దొరికేది. ఇప్పుడు ఎరువుల కోసం ఎంత తిరిగినా దొరకతలేవు. నాటి ప్రభుత్వం మంచిగ చేసేది, ఇప్పుడైతే మమ్మల్ని మస్తు బాధ పెడుతున్నారు.
గుండెల్లి రాజయ్య, రైతు, ముండ్రాయి గ్రామం
దళారులకు చేరోద్దని ఓటీపీ
యూరియా దళారులకు చేరోద్దని ఉద్దేశంతో ఓటీపీ విధానం ప్రభుత్వం అమలు చేసింది. ఈసారి అగ్రికల్చర్ కి మాత్రమే 1800 మెట్రిక్ టన్నుల యూరియా నివేదిక పంపించాం. మండలంలో ప్రస్తుతానికి వరి 18,500 ఎకరాల్లో సాగు చేశారు.
రైతులు యూరియా వినియోగంపై స్పష్టమైన సమాచారం కోసం ఒక పాస్ బుక్కు రెండు యూరియా సంచులు మాత్రమే ఇవ్వాలని ఆదేశాలున్నాయి. యూరియా ఏ రోజు వస్తుందని ఒక రోజు ముందస్తుగానే రైతులకు సమాచారం అందిస్తున్నాము. యూరియా నిల్వ లేకుండా రైతులకు వెంటనే సరఫరా చేస్తున్నాము.
గీత, నంగునూరు మండల వ్యవసాయ అధికారి.