calender_icon.png 12 July, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి స్టేట్ ఫస్ట్ బెస్ట్ అవార్డు

12-07-2025 12:30:24 AM

  1. రూ. 15 లక్షల ప్రైజ్ మనీ..

సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ ఘనత 

బెల్లంపల్లి అర్బన్, జూలై 11 : బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రాష్ర్ట స్థాయి ఉత్తమ ఆసుపత్రి అవార్డుకి ఎంపికయింది. కాయకల్ప ప్రోగ్రాంలో ఉత్తమ వైద్య సేవలు అందించిన ఆస్పత్రి రాష్ర్ట స్థాయిలో మొదటి బహుమతి సాధించింది.

బెల్లంపల్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవికుమార్ పర్యవేక్షణలో వంద పడకల ఆసుపత్రిలో పారిశుద్ధం, పర్యావరణ వైద్య సేవలు, ఇన్ఫెక్షన్ నియంత్రణ ఇత్యాది సేవలు ఎంతగానో మెరుగయ్యాయి.

పరిశుభ్రత, వైద్య సేవలు మెరుగుదల, రోగులకు సేవలందించడంలో ఆస్పత్రి ముందంజలో ఉంది. వంద పడకల ఆసుపత్రిలో తగినంత సిబ్బంది, వైద్యులు లేనప్పటికీ ఉన్న వైద్య సిబ్బంది, వైద్యులతో ఆసుపత్రిని వైద్య సేవా రంగంలో ఎంతో పురోగతిలో నిలబెట్టారు. 

ఇటీవల కాయకల్ప రాష్ర్ట స్థాయి బృందం ఆస్పత్రిని సందర్శించి వైద్యసేవలను పరిశీలించారు. అన్ని రంగాల్లో ఆసుపత్రి విభాగాలు సేవారంగంలో ఫలప్రదంలో ఉన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది మొత్తంగా ఆసుపత్రి యంత్రాంగం ఆరోగ్య సేవలో చిత్తశుద్ధితో పనిచేశారు.

రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించారు. కార్పొరేట్ హాస్పిటల్ కి దీటుగా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని సేవారంగంలో కఠోర దీక్షతో వైద్య సిబ్బంది ముందు వరుసలో నిలబడ్డారు. పరిశుభ్రత వ్యాధుల నియంత్రణ, పీర్ సమీక్ష సంస్కృతిని పెంచడం, పరిశుభ్రత విషయంలో ప్రామాణికత ప్రోటో కాల్ ను వైద్య సిబ్బంది పాటించి ఆదర్శంగా నిలిచారు. 

అత్యుత్తమైన సేవలకి గాను 2024 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ అవార్డు కోసం ఆసుపత్రి సేవారంగంలో రాష్ర్టస్థాయిలో పోటీ పడింది. ఉత్తమ బెస్ట్ ఆస్పత్రి అవార్డుకి బెల్లంపల్లి ఆసుపత్రి ఎంపికయింది. రాష్ర్ట స్థాయిలో కాయకల్ప అవార్డుకు ఎంపికైన ఆసుపత్రికి రూ. పదిహేను లక్షల ప్రైజ్ మనీ అవార్డు ఇవ్వనున్నారు.

రాష్ర్ట ఉత్తమ బెస్ట్ ఆసుపత్రి అవార్డును గెలుచుకున్న బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి ప్రైజ్ మనీ రూ.15 లక్షలతో మరిన్ని వైద్య సేవలు, ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగపడనున్నాయి. 2015 నుంచి కాయకల్ప ఉత్తమ అవార్డు పథకం జిల్లా ఆసుపత్రి నుండి చేపట్టారు. పిహెచ్సి స్థాయికి 2016లో విస్తరించింది. 2017 నాటికి అన్ని పట్టణ ఆరోగ్య జిల్లా కేంద్రాలకు అవార్డులు వర్తింపజేశారు.

అందులో భాగంగానే కాయకల్ప అవార్డు పోటీలు రాష్ర్టస్థాయిలో చేపట్టారు. స్వచ్ఛభారత్ మిషన్ పొడిగింపు కాయకల్ప అవార్డు పథకం వల్ల వైద్య ఆరోగ్య రంగంలో పోటీ పనితీరు పెరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2015లో కాయకల్ప అవార్డును ప్రవేశపెట్టింది.

కాయకల్ప అవార్డు పోటీలో రాష్ర్టవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు పాల్గొన్నాయి. రాష్ర్టవ్యాప్తంగా మొదటి శ్రేణిలో బెల్లంపల్లి ఆసుపత్రి కాయకల్ప అవార్డును సొంతం చేసుకునీ బెల్లంపల్లి ప్రతిష్టను రాష్ర్ట స్థాయిలో నిలబెట్టారు.

అవార్డు రావడం ఆనందంగా ఉంది:  డాక్టర్ రవి కుమార్, సూపరింటెండెంట్ బెల్లంపల్లి 

రాష్ర్ట స్థాయి కాయకల్ప మొదటి శ్రేణి అవార్డు, రూ.15 లక్షల ప్రైజ్ మనీ సాధించడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు కోసం ఆస్పత్రిలోని అన్ని విభాగాలు సమన్వయంతో చేసిన కృషి ఫలితం అవార్డు. ఇది అందరి విజయం. రాష్ర్టస్థాయి మొదటి శ్రేణి కాయకల్ప అవార్డుకు ఎంపికలో అన్ని స్థాయిల్లో జరిగిన ప్రోగ్రాంలో బెల్లంపల్లి ఆసుపత్రి వైద్య సిబ్బంది విశేషమైన కృషితో విజయ పతంలో నిలిచింది.

కాయకల్ప ప్రోగ్రాం లో భాగంగా మన  ఏరియా హాస్పిటల్ రూ.15 లక్షల మొదటి బహుమతి రావడం జరిగింది. ఇది రాష్ర్టస్థాయిలోనే మొట్టమొదటి స్థానంలో బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ నిలవడం గర్వంగా ఉంది. 2024 - 25 కు సంబంధించి ఈ కాయకల్ప అవార్డు సాధించాం.  ఇందుకు కృషి చేసిన హాస్పిటల్స్ సిబ్బంది అందరికీ  హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరి సహకారంతో ఇలానే ముందుకెళ్తూ.. మరెన్నో అవార్డులు  సాధించుకోవాలి.