calender_icon.png 12 July, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణహిత నది తీరంను పరిశీలిస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్

12-07-2025 12:31:25 AM

వర్షా కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

కోటపల్లి,(చెన్నూర్): వాన కాలంలో భారీ వర్షాలు కురిసి వరద పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తు, వరద నీరు పంట చేలలోకి రావడంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ కోటపల్లి తహశిల్దార్ రాఘవేందర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మయ్య, సి.ఐ. బన్సీలాల్ లతో కలిసి కోటపల్లి మండలం సిర్సా, వేమనపల్లి మండలం రాచర్ల గ్రామాలలో ప్రాణహిత నది తీరంలో వరద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వరద కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉన్నందున చేపలు పట్టేందుకు, వాగులు, నదులు దాటేందుకు ఎవరు వెళ్ళకుండా బందోబస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలందరికీ తెలిసే విధంగా గ్రామాలలో టాం-టాం వేయించాలని తెలిపారు. గ్రామాలలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. వరద విపత్తి సమయంలో ప్రజల సహాయార్థం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ (08736-250501) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారం అందించాలని, పాఠశాలలో కొనసాగుతున్న మూత్రశాలల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బడి బయట పిల్లలు, మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలకు వచ్చేలా చూడాలని, విద్యార్థుల సంఖ్య పెంచాలని కోరారు. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ ఎ.ఓ., సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు.