31-12-2025 01:18:49 AM
కోల్‌కతా, డిసెంబర్ ౩౦: ఓట్ల కోసం బెంగాల్ ప్రభుత్వం బంగ్లా నుంచి చొరబాట్లను ప్రోత్సహిస్తోందని, తద్వారా సీఎం మమతా బెనర్జీ ఉగ్రవాదానికి సహాయ సహకారాలు అందిస్తున్నారని కేంద్ర హోమంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతా పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అక్రమ చొరబాట్లు జాతీయ భద్రతకు పెను ముప్పుగా మారిందని పేర్కొన్నారు.
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చొరబాట్లపై ఉక్కుపాదం మోపుతామని ప్రతినబూనారు. చొరబాటుదారులను వెతికి మరీ ఏరివేస్తామని తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రక్షణ కంచె ఏర్పాటుకు బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని, కనీసం భూమి ఇవ్వమని అడిగితే ఆ పని కూడా చేయడం లేదని ఆరోపించారు.
15 ఏళ్ల తృణమూల్ పాలనలో అవినీతి, భయం, అరాచకం పెచ్చుమీరాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదల సంక్షేమ పథకాలను బెంగాల్ టోల్ సిండికేట్లు అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే కొలువుదీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.