calender_icon.png 8 August, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

07-08-2025 10:41:22 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

దండేపల్లి: ప్రభుత్వ ఆసుపత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్సీని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సదుపాయాలపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. 

మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి

విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. కర్ణపేటలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలని, ఉపాధ్యాయులు విధుల పట్ల సమయపాలన పాటించాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి చారించాలని ఆదేశించారు.

అనంతరం లింగాపూర్ లోని ఆదర్శ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో అందిస్తున్న ఆహారం నాణ్యత, సదుపాయాల వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని, గుణాత్మక విద్యను అందించాలన్నారు. అనంతరం ద్వారక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అధికారులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. 

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీటిని అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. లింగాపూర్ గ్రామంలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, ప్రతి రోజు ఇంటింటి నుండి తడి, పొడి చెత్తలను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలన్నారు. గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, వనమహోత్సవం కార్యక్రమం కొరకు అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని, సకాలంలో మొక్కలకు నీటిని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. 

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్ 

మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. లబ్ధిదారులు నిబంధనల ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని, అలా నిర్మిస్తేనే బిల్లులు త్వరగా మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నిరుపేదల కొరకు ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు సద్వినియోగపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.