calender_icon.png 13 May, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెరుగైన వైద్యసేవలు అందించాలి

13-05-2025 12:56:11 AM

అధునాతన ల్యాబ్ సౌకర్యం కల్పిస్తాం: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బోధన్, మే 12 (విజయక్రాంతి): ఆసుపత్రి కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు.

ఈ సందర్బంగా ఆసుపత్రి వైద్యులతో కలిసి సమీక్ష సమావేశం జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైద్య సిబ్బంది సూచన మేరకు 15 రోజులలోపు అధునాతన ల్యాబ్ మెషిన్ ను సమాకూరుస్తామన్నారు.  గత ప్రభుత్వంలో ఆసుపత్రులలో సరైన వసతులు కల్పించలేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళి ఆర్థికంగా నష్టపోయారని అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో నెలకు 170  ప్రసవాలు జరుగుతున్నాయని, ఓపీ 15,000, ఇన్ పేషెంట్ 7000మందికి పైగా రోగులు ఆసుపత్రిలో చికిత్స కై వస్తున్నారని తెలిపారు. వైద్యులు ఆసుపత్రికి వచ్చే రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఆసుపత్రిలో వైద్యులకు ఇబ్బంది కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అనంతరం నర్సింగ్ కళాశాలలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి నర్సింగ్ డే వేడుకలు జరుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రాహుల్, ఆర్‌ఎంఓ రహీం, ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ విఠల్, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, పాషా, నాగేశ్వర్ రావు, దాము, నరేందర్ రెడ్డి, సీఐ వెంకటనారాయణ, ఆసుపత్రి సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.