calender_icon.png 13 May, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్లక్ష్యపు శిశువులకు అండగా ‘ఊయల’

13-05-2025 12:53:24 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, మే 12 (విజయక్రాంతి): అప్పుడే పుట్టిన శిశువును వద్దనుకునే వారు నిర్లక్ష్యంగా  రోడ్లపై,  చెత్త కుప్పల్లో వదిలి వేయవద్దని, శిశువుల సంరక్షణ ఏర్పాటుచేసిన  ఊయల (క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్)లో వదిలి వెళ్లాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని మాత శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) లో, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మహిళా, శిశు, సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిశువుల స్వీకరణ కేంద్రం ను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. అప్పుడే పుట్టిన శిశువులను వద్దనుకునేవారు ఊయలను సద్వినియోగం చేసుకోవచ్చని సూచించారు.

శిశువులకు అనారోగ్య సమస్యలు ఉన్నా వైద్యం అందించి శిశుగృహకు తరలించి పెంచి పెద్ద చేస్తారని అన్నారు. ఈ ఊయల వద్ద ఎలాంటి సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండదని, ఊయలలో వేసిన వారిపై నిఘా, విచారణ వంటివి ఉండవని తెలిపారు. వివరాలు వెల్లడించినప్పటికీ అవి గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. నేరుగా శిశువును అప్పగించాలనుకునేవారు 9490881098 నెంబర్ కు సమాచారం ఇవ్వవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

శిశువులను రోడ్ల పైన, చెత్తకుప్పల పైన వదిలేయడం వల్ల మరణించే అవకాశం ఉందని, ఎంతోమంది పిల్లలు లేని దంపతులు దత్తత కోసం ఆశ్రయిస్తున్నారని తెలిపారు. వదిలి వేసిన శిశువులను చట్టప్రకారం దత్తత ఇస్తారని వివరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డిఎంహెచ్వో వెంకటరమణ, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్‌ఎంఓ నవీన, డీసీపీఓ పర్వీన్, చైల్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.