14-05-2025 12:56:16 AM
మోమిన్ పేట్, మే 13: గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం పెద్ద మొత్తంలో రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మోమిన్ పేట మండలంలో 10 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు గావించారు.
ఈ సందర్భంగా రాళ్ళ గుడుపల్లి నుండి గుట్టమిది తాండా వరకు 2.40 కోట్లతో విలువ గల గిరిజన అభివృద్ధి ప్రత్యేక నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు, ఉపాధి హామీ పథకం కింద రాళ్ళ గుడుపల్లి లో 15 లక్షల వ్యయంతో, లచ్చ నాయక్ తాండాలో 20 లక్షల సీసీ రోడ్డు, మోమిన్ పేట్ లో 1.05 కోట్లతో సీసీ రోడ్డులను స్పీకర్ ప్రారంభించారు.
అదేవిధంగా మోమిన్ పేట్ లో ఇందిరమ్మ ఇల్లు నమూనా నిర్మాణానికి భూమి పూజ, బిక్కరెడ్డి గూడెంకు 3 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు, మల్లారెడ్డి గూడెం మొండి కట్ట వాడుక చెరువుకు 16.85 లక్షల వ్యయంతో చేపట్టే మరమ్మత్తుల పనులకు శంకుస్థాపన చేశారు.వేల్చాల్ లో 55 లక్షలు, దుర్గం చెరువులో 50 లక్షలు, మొరంగపల్లి లో 45 లక్షలు ఇజ్రా చిట్టెంపల్లి లో 30 లక్షలు, కేసారం లో 30 లక్షలు, ఎన్కేపల్లి లో 45 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లకు స్పీకర్ ప్రారంభోత్సవాలు గావించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కృషి చేయాలని సూచించారు. స్పీకర్ పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ఇఇ ఉమేష్, తహసిల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంపీడీఓ విజయ లక్ష్మి, హౌసింగ్ డీఈ,ఇఇ సయ్యద్ సాజిద్, శిరాజుద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, స్థానిక నాయకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.