14-05-2025 12:56:27 AM
వనపర్తి టౌన్, మే 13 : కొనుగోలు కేంద్రాలలో కాంటాలు పెట్టడం లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అగ్రిహిస్తూ మంగళవారం ఆత్మకూర్ మండలం ఆరెపల్లి అన్నదాతలు వనపర్తి సమీకృత కలెక్టర్ లోని జిల్లా పౌర సరఫరాల కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఆత్మకూరు మండలం ఆరెపల్లి కొనుగోలు కేంద్రంలో కాంటాలు ఎందుకు పెట్టడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు.
కొనుగోలు కేంద్రాలకు దొడ్డు వడ్లు తెచ్చి రోజులు గడిచినా కాంటాలు ఎందుకు పెట్టడం లేదంటూ కార్యాలయ సిబ్బందిని రైతులు నిలదీశారు. ఎప్పుడు వర్షం వస్తుందోనని భయంగా ఉన్నదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పక్షపాతంతో దొడ్డు వడ్ల ధాన్యం కాంటాలు పెట్టడం లేదని ఆరోపించారు.
కొనుగోలు కేంద్రంలో నెల రోజులైనా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు ఆరోపించారు. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, వర్షానికి ధాన్యం తడిసిపోతున్నదని, కొన్నవాటికి లారీలు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు.
ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళనను విరమించేదిలేదని పట్టుబట్టారు. కొనుగోలు కేంద్రాల్లో కంటాలను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడం తో రైతులు నిరసన కార్యక్రమం ను విరమింపచేశారు.