12-09-2025 12:00:00 AM
-ఘట్కేసర్ లో నిరాహార దీక్ష
-ఎఫ్‌ఎస్‌సిఎస్‌లో ఒక్క రైతుకూ అందని మాఫీ
-మిగతా సొసైటీలలోనూ ఇదే పరిస్థితి
-దీక్ష చేయొద్దని రైతునాయకులపై పోలీసుల ఒత్తిడి
-చేసి తీరుతామని స్పష్ఠీకరణ
మేడ్చల్, సెప్టెంబర్ 11(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రుణమాఫీ పై రైతులు ఆందోళన బాట పట్టారు. అర్హత ఉన్న తమకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఘట్కేసర్ ఎఫ్ ఎస్ సి ఎస్ రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సొసైటీలో ఒక్క రైతుకు కూడా రుణమాఫీ వర్తించలేదు. ప్రభుత్వం రైతులకు మూడు విడతలుగా రుణమాఫీ చేసింది. రాష్ట్రంలో అర్హులందరికీ రుణమాఫీ చేశామని ప్రభు త్వం ప్రకటించింది.
ఈ ప్రకటనతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రుణమాఫీ ప్రక్రియ అయిపోయిందని ప్రభుత్వమే ప్రకటించడంతో తమకు మాఫీ రాదని ఆందోళన చెంది జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకు వినతి పత్రాలు సమర్పించారు. అర్హత ఉన్న తమకు మాఫీ వర్తించేలా చూడాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనకు సిద్ధమయ్యారు. రైతు రుణమాఫీ సాధన సమితి ఏర్పాటు చేసుకుని బుధవారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు.
నిరాహార దీక్ష చేయకుండా పోలీ సులు శతవిధాల ప్రయత్నించారు. సొసైటీలో సభ్యులుగా ఉన్న వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల పై ఒత్తిడి తెచ్చారు. తమ చేతిలో ఏమీ లేదని రాజకీయ నాయకులు పోలీసులకు వివరించారు. అధికారుల సైతం గురువారం రైతుల వద్దకు వచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ, ఏ డి ఏ వెంకట్ రామ్ రెడ్డి రైతుల వద్దకు వచ్చి నాలుగో విడతల మాఫీ అవుతుందని, అర్హు ల జాబితా ట్రెజరీకి పంపామని తెలిపారు. ప్రభుత్వము నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరాహార దీక్ష చేస్తామని రైతులు స్పష్టం చేశారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
అధికారుల నిర్లక్ష్యం వల్లే అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలుస్తోంది. ఆధార్ నంబర్ ఎంట్రీ చేయకపోవడం, తప్పుగా ఎంట్రీ చేయడం, ఆన్ లైనులో పెట్టకపోవడం తదితర కారణాల వల్ల జిల్లాలోని వివిధ సొసైటీలలో రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. జిల్లాలో కేవలం 4371 మంది రైతులకు రూ.29 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. అర్హత ఉండి మాఫీ కానీ రైతులు జిల్లాలో చాలామంది ఉన్నారు. ఘట్కేసర్ ఎఫ్ ఎస్ సిఎస్ కు యూనియన్ బ్యాంక్ ఫండింగ్ ఇస్తుంది. రుణ రైతుల జాబితా ఆన్ లైన్లో లేదు.
రుణమాఫీ ప్రారంభ సమయంలో ఆన్ లైన్ ఉన్న జాబితాను మాత్రమే డి సి ఓ, వ్యవసాయాధి కారులు ప్రభుత్వానికి పంపారు. ఘటకేసర్ సొసైటీలో 1189 మంది రైతులలో ఒక్కరికి కూడా రుణమాఫీ వర్తించలేదు. ఈ ఒక్క సొసైటీలోనే సుమారు రూ. 8 కోట్ల పైన మాఫీ కావలసి ఉంది. కీసర, శామీర్ పేట్, పూడూరు, మేడ్చల్, దబిలిపూర్ సొసైటీలలో కూడా పెద్దసంఖ్యలో రైతులకు రుణమాఫీ వర్తించలేదు. అర్హత ఉండి చిన్నచిన్న క్లారికల్ తప్పిదాల వల్ల మాఫీ పొందలేని వారికి కూడా మాఫీ వర్తింప చేస్తే వేల సంఖ్యలో రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశముంది.
డబిల్ పూర్ సొసైటీలో 318 మందికి అందని మాఫీ
మేడ్చల్ మండలం దబిల్పూర్ సొసైటీలో 318 మందికి రుణమాఫీ కాలేదు. వీరందరికీ అర్హత ఉంది. ఆధార్ నంబర్ తప్పు పడడం, ఆన్ లైన్ లో లేదనే కారణాలు చూపుతూ మాఫీ వర్తింప చేయకపోవడం సరికాదు. అర్హత ఉన్న వారందరికీ మాఫీ చేయాలి.
- సురేష్ రెడ్డి, సొసైటీ చైర్మన్
ఒక్కరికీ మాఫీ కాలేదు
మా సొసైటీలో అర్హత ఉన్నప్పటికీ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు.1189 మందికి రుణమాఫీ కావాలి. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా రుణమాఫీ చేయాలి. రుణమాఫీ పై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఆందోళన కొనసాగుతుంది.
- రేసు లక్ష్మారెడ్డి, ఘటకేసర్ సొసైటీ డైరెక్టర్
అర్హుల జాబితా ట్రెజరీకి పంపాం
రుణమాఫీకి అర్హులైన వారి జాబితా ట్రెజరీకి పంపాం. నాలుగో విడతలో మాఫీ వచ్చే అవకాశం ఉంది. ఘట్కేసర్ సొసైటీలో 1052 మంది రుణమాఫీకి అర్హులు. ఆడిట్ సమస్య వల్ల వీరికి రుణమాఫీ జరగలేదు. ఆడిట్ ఫైనల్ రిపోర్ట్ రావడంతో జాబితాను ట్రెజరీకి పంపాం.
చంద్రకళ, జిల్లా వ్యవసాయ అధికారిని