calender_icon.png 29 August, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలం గోదావరి నదిలో నిమజ్జనోత్సవ

29-08-2025 03:04:33 AM

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు

భద్రాచలం, ఆగస్టు 28, (విజయక్రాంతి): గణేష్ నవరాత్రుల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన ఏర్పాట్లను చేయడం జరుగుతుందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ సందర్బంగా గోదావరి నది కరకట్ట వద్ద జరుగుతున్న నిమజ్జనోత్సవ ఏర్పాట్లను గురువారం పరిశీలించారు.

అక్కడ ఉన్న అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో పరిసర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గోదావరి నదీ ప్రవాహాన్ని వీక్షించేందుకు కరకట్ట మీదకు ఎవరూ రాకూడదని సూచించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కరకట్ట మీద ఎవరైనా సంచరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా కరకట్ట పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. నిమజ్జనోత్సవానికి గణేష్ ప్రతిమలను తీసుకొని వచ్చే ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారి సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ,భద్రాచలం సీఐ నాగరాజు, ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

పగిడేరు వాగు వరద ప్రవాహన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం, ఆగస్ట్ 28(విజయ క్రాంతి): ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం తీగలబంజార వద్ద గల పగిడేరు వాగు వరద ప్రవాహన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. జిల్లాలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతోనీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని ఆన్నారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటవద్దని, యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని సూచించారు.

ఇవాళ కూడా ఇదే పరిస్థితులు వుండే అవకాశం ఉందని వాతావరణం శాఖ హెచ్చరికల నేపథ్యంలో వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 స్ధానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712 659111, కలెక్టర్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1077, సెల్ నెంబరు 9063211298 సమాచారం ఆందిచాలని సూచించారు.ఇప్పటికే చెరువులు, వాగుల వద్ద పోలీస్ పెట్రోలింగ్ పెంచి ప్రమాద హెచ్చరికలను తెలియజేసేలా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టలపై బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాల భారీన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని పోలీస్ అధికారులకు సూచించామని తెలిపారు. అదేవిదంగా ఎగువ ప్రాంతంలో అధిక వర్షాల మూలంగా మున్నేరు వరద ఉధృతి పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ప్రజలు కూడా అపప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.