29-08-2025 03:01:59 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
మణుగూరు, ఆగస్టు 28, (విజయక్రాంతి) ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు, ఉపాధి హామీ పథకం పనులకు నాణ్యమైన ఇటుకలను తక్కువ ఖర్చుతో అందించడానికి మణుగూరు మండలం దమ్మక్కపేట సమీపంలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) వద్ద ఫ్లై యాష్ వినియోగంతో నాణ్యమైన ఇటుకలు తయారీ విధానాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన ఇటుకల తయారీ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లాలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు , ఉపాధి హామీ పథకం పనులలో అధిక నాణ్యత కలిగిన నిర్మాణ సామాగ్రి అందించడం ప్రధాన లక్ష్యం అని కలెక్టర్ తెలిపారు.ఫ్లైయాష్ వినియోగం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని, ఉత్పత్తి తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాన్ని సమర్థవంతంగా వినియోగించి ఇటుకలని తయారు చేసి ఉపయోగించవచ్చని చెప్పారు.
స్థానిక అవసరాలకు అనుగుణంగా విస్తృతంగా ఇటుకలను తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. వీటిపై విస్తృత ప్రచారం జరగడం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున ఇటుకల తయారికి దోహదం అవుతుందని, తద్వారా లబ్ధిదారులు నేరుగా లాభపడగలరని తెలిపారు.ఆగస్టు 30న బీటీపీఎస్లో మూడు మిషన్ల ద్వారా వివిధ మిశ్రమాలతో నాణ్యమైన ఇటు కలను తయారుచేసే విధానంపై శిక్షణ , అవగాహన కార్యక్రమం నిర్వహించడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొని శిక్షణ పొందవచ్చని కలెక్టర్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్లు, సూపర్డెంట్ ఇంజనీర్లు, పంచాయతీరాజ్ అధికారులు, ఉపాధి హామీ పథకం అధికారులు, గృహ నిర్మాణ విభాగ ఇంజనీర్లు, తాసిల్దార్, ఎంపీడీవో, ఏపీవో, అధికారులు పాల్గొన్నారు.