19-11-2025 12:12:11 AM
ఢాకాలోని ప్రజాప్రతినిధుల ఇండ్ల ముట్టడి
బాష్పవాయువులు, గ్రనేడ్‌ల ప్రయోగించిన పోలీసులు
ఇద్దరు ఆందోళనకారుల మృతి
ఢాకా, నవంబర్ 18: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీడ్ పార్టీ అధినేత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ఐసీటీ) ఇచ్చిన తీర్పుపై అవామీ లీగ్ కార్యకర్తలు, అభిమానులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. ఐసీటీ తీర్పును వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢాకా సహా దేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఆందోళనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులు ఢాకాలోని షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ నివాస ప్రాంతం సహా 32 ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించారు. పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల ఇండ్లపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేంందుకు పోలీసులు సౌండ్ గ్రెనేడ్‌లు, బాష్ప వాయువులు ప్రయోగించారు. పలుచోట్ల లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
ఈ ఘర్షణలో ఇద్దరు ఆందోళనకారులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మరోవైపు షేక్ హసీనాకు మద్దతుగా సోషల్‌మీడియాలో వస్తున్న పోస్టులు, ప్రకటనలను ప్రచారం చేయొద్దని తాత్కాలిక ప్రభుత్వం అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్‌లైన్ మీడియా సంస్థలను హెచ్చరించింది. ఎవరైనా వార్తలు ప్రసారం చేసేవారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామ.
గతేడాది జెన్‌జెడ్ ఉద్యమం వచ్చిన నాటి నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమెను తమ దేశానికి అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు లేఖసైతం రాసింది. దీనిపై భారతప్రభుత్వం సైతం ‘బంగ్లా ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయంతీసుకుంటాం. అన్ని విధాలా ఆలోచించి స్పందిస్తాం’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే.