02-09-2025 12:47:49 AM
మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రభుత్వం కుట్ర
-కాళేశ్వరంపై సీబీఐ విచారణ అందులో భాగమే..
-కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ శ్రేణుల ఫైర్
కరీంనగర్/యాదాద్రి భువనగిరి/సూర్యాపేట, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): కాలేశ్వరం ప్రాజెక్టుపై విచారణను ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంతో బీఆర్‌ఎస్ నాయకులు భగ్గుమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదంటూ సోమవారం నిరసనలకు దిగారు. భువనగిరిలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ నిరసనలో మాజీ విప్ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, పైళ్ళ శేఖర్‌రెడ్డి, పార్టీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు తుంగ బాలు, రాష్ర్ట నాయకులు చింతల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేటలో బిఆర్‌ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తుంగతుర్తిలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి జలాలతో అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమం లో నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బుజ్జ యుగంధర్‌రావు, పి యాదగిరి, కే శోభన్‌బాబు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు అమరవీరుల స్థూపాలకు, తెలంగాణ తల్లి విగ్రహాలకు అభిషేకం చేసి నిరసనలు తెలిపారు. మిడ్ మానేరు వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడంతోపాటు మిడ్ మానేరు జలాలను పసుపుచల్లి శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, మాజీ జడ్పీ చైర్మన్లు తుల ఉమ, అరుణ పాల్గొన్నారు.
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, బీఆర్‌ఎస్వీ నాయకుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యం లో ఎల్‌ఎండీలోని జలాలను బిందెలతో తీసుకువచ్చి తెలంగాణ అమరవీరుల స్థూపానికి అభిషేకం చేశారు. హుజూరాబాద్ పట్టణం లో అంబేద్కర్ చౌరస్తా వద్దగల అమరవీరుల స్థూ పానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం చేశారు. బీఆర్‌ఎస్ రాష్ర్ట కార్యదర్శి బండ శ్రీనివాస్ పా ల్గొన్నారు.
కోరుట్ల నియోజకవర్గంలో పలు చో ట్ల నిరసనలు తెలిపారు. పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరు ట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆదేశం మేరకు రాజేశ్వర్రావుపేట పంపుహౌజ్‌ను సందర్శించి అందులోని నీటితో తెలంగాణ తల్లి విగ్రహానికి అభిషేకం చేశారు. జగిత్యాల మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత పాల్గొన్నారు.