calender_icon.png 27 January, 2026 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి విప్లవకారుడు రామదాసు!

22-01-2026 12:00:00 AM

భక్త రామదాసు అనే పేరు నేటి తరానికి అంతగా పరిచయం లేకపోవ చ్చు. కానీ శ్రీరామదాసు అనగానే మాత్రం రాముడు భక్తుడన్న విషయం వెంటనే గుర్తొకొస్తుంది. భక్తరామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. ఈయన 1620వ సంవత్సరంలో నేటి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో లింగ న్న, కామాంభ దంపతులకు జన్మించారు. నేలకొండపల్లి సంతాన వేణుగోపాలస్వామి ఆశీర్వాదం వల్ల జన్మించడంతో ఆయనకు గోపన్న అని పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. గోపన్న తన చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకోవడం వల్ల అనేక కష్టాలు ఎదుర్కొ న్నారు. చిన్నతనం నుంచే గోపన్న శ్రీరాము ని భక్తుడు కావడం వల్ల అందరు ఆయన్ను రామదాసుగా పిలిచేవారు. 

తహసీల్దారుగా నియామకం

రామదాసు యుక్తవయసు రాగానే మేనమామ కూతురు కమలాంబతో వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత నేలకొండపల్లి ప్రాంతంలో తీవ్ర కరువు కాటకాలు సంభవించాయి. అయినప్పటికీ తమ కష్టాలను బయటికి రానీయకుండా కంచర్ల గోపన్న దంపతులు జీవనం సాగిస్తుండేవారు. ఇదే సమయంలో గోపన్న మేనమా మలు అక్కన్న, మాదన్నలు కుతుబ్‌షాహీలలో ఏడవ రాజైన అబుల్ హసన్ తానీషా వద్ద పనిచేసేవారు. మాదన్న మహామంత్రిగా, అక్కన్న సైన్యాధికారిగా పరిపాలనా విధులు నిర్వర్తించేవారు.

ఈ నేపథ్యంలో 1670లో గోపన్న కష్టాలను దగ్గరుండి చూ సిన అతని మేనమామలు తమ మేనల్లుడికి ఏదైనా దారి చూపాలంటూ తానిషా వద్ద మొరపెట్టుకున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న తానీషా కంచర్ల గోపన్నను పా ల్వంచ పరగణాకు ‘తహసీల్దారుగా’ నియమించారు. నాటి పాల్వంచ పరగణాలోనే భద్రాచలం గ్రామం ఉండేది.

పన్నులతో రాముడికి గుడి!

భద్రాచలంలో గోదావరి ఒడ్డున తమ్మల దమ్మక్క శ్రీరాముని చెక్క విగ్రహాలను ఆరుబయట చిన్న పాకలో పెట్టి నిత్యం పూజలు చేస్తుండేది. ఆమె రాముడికి చేస్తున్న విశేష పూజల గురించి తెలుసుకున్న రామదాసు అక్కడికి వెళ్లి తన రాముడు సరైన గుడి లేక ఎన్నో కష్టాలు పడుతున్నారన్న విషయం తెలిసి చాలా బాధపడారు. ఎలాగైనా రాముడికి గుడి కట్టించాలని నిశ్చయించుకున్న రా మదాసు శ్రీరాముడికి శాశ్వత దేవాలయం పేరుతో రాజు అనుమతి లేకుండానే నిర్మా ణం ప్రారంభించారు. అందుకు తాను వసూలు చేసిన పన్ను డబ్బులు, ఊరూరా వసూలు చేసిన విరాళాలను పోగుచేసి రా ముడి దేవాలయాన్ని పూర్తి చేశారు. అయితే ఈ విషయం రామదాసు అంటే గిట్టనివాళ్ల చెవిలో పడడంతో తానీషా ప్రభువుకు ఫిర్యాదు చేశారు.

దీంతో రాజాజ్ఞ మేరకు రామదాసును గోల్కొండలోని కారాగారంలో 12 సంవత్సరాల పాటు బంధించారు. కాలక్రమంలో తానీషా ప్రభువుకు ఒకరోజు రాత్రి కలలో ఇద్దరు తేజస్సు గల యువకులు కనిపించారు. వారి పేర్లు రామోజీ, లక్ష్మోజీ లుగా చెప్పుకున్న ఆ యువకులిద్దరు రామదాసు బాకీ ఉన్న మొత్తం సొమ్మును బంగా రు నాణేల రూపంలో తానీషా ప్రభువుకు చెల్లించారు. రాజు మరునాడు లేచి చూసేసరికి ఎదుట బంగారు నాణేల కుప్ప కనిపించింది. దీంతో తన కలలో కనిపించింది స్వ యంగా రామలక్ష్మణులే అన్న విషయం తెలుసుకున్న తానీషా తెగ సంబరపడిపోయాడు. ఆ తర్వాత వెంటనే తానీషా ప్రభువు స్వయంగా రామదాసు కారాగారానికి వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పి ఆయన్ను విడుదల చేశాడు.  

మోక్షమార్గం..

ఇక రామదాసు ప్రతి సందర్భంలోనూ శ్రీరాముడిని ప్రశ్నిస్తూనే వచ్చారు. రామాలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో, ఒకరోజు యాత్రికులకు భోజనం సమకూర్చే హడావుడిలో రామదాసు ఉండగా, ఆయన కుమారుడు రఘురాముడు పాకుతూ వెళ్లి గంజిగుంటలో పడిపోయి స్పృహ కోల్పోయాడు. స్పృహలో లేని తమ కుమారుడిని చూసి బోరున ఏడ్చిన రామదాసు ‘సీతారామ స్వామి.. మేం చేసిన నేరములేమీ?.. ఎందుకు మాకు ఈ శిక్ష’ అంటూ రాముడికి ప్రశ్నను సంధించారు. ఇక కర్మాగారంలో బంధీగా ఉన్నప్పుడు శిక్ష అనుభవించిన సమయంలో రామదాసు చిత్రహింసలకు గురయ్యాడు. భటులు రామదాసును కొరడాలతో కొట్టడం, తేళ్లతో కుట్టించడం లాం టివి చేస్తుండడం ఆయన్ను చాలా బాధించింది.

ఈ సందర్భంలో ‘ఎవడబ్బ సొ మ్మనీ.. కులుకుతూ తిరిగేవూ రామచంద్రా.. నీ తండ్రి దశరథ మహరాజు ఇచ్చేనా, నీ మామ జనక మహారాజు బంగారు నగలు చేపించేనా’ అని ఆవేదనతో శ్రీరాముడిని ప్రశ్నోత్తరాలు సంధించారు. శ్రీరాముడు కరగలేదని ఏకంగా సీతమ్మ తల్లి ద్వారా సిఫార్సు చేసినట్లు చెబుతారు. ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి.. నను బ్రోవమని చెప్పవే’ అని భోరున విలపిస్తూ మొరపెట్టుకున్నారు. అంతేకాదు తానీషా ప్రభువుకు తాను బాకీ ఉన్న సొమ్ము మొత్తాన్ని చెల్లించి విడిపించింది సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు వు, లక్ష్మణస్వాములే అన్న విషయం తెలుసుకున్న రామదాసు.. స్వామి దర్శనం నవాబు తానీషాకు అయిందని, కానీ తనకు ఆ అదృ ష్టం  దక్కలేదంటూ పదేపదే విచారం వ్యక్తం చేసేవారు. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీరాముడు ప్రత్యక్షమై రామదాసుకు మోక్షమా ర్గం ప్రసాదించినట్లు చరిత్ర పేర్కొంటుంది.

ప్రాముఖ్యత ఇవ్వాలి..

కాగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో భక్త రామదాసు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ భక్త రామదాసు విధ్వత్ కళాపీఠం వారి ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ తొలి వాగ్దేయకారుడిగా పేరు పొందిన భక్త రామదాసుకు ప్రభుత్వాలు ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదని నేలకొండపల్లి గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాళ్లపాక అన్నమాచార్యులు, త్యాగరాజులకు దక్కినంత గౌరవం, ప్రాముఖ్యత భక్త రామదాసుకు కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పించాలని కోరుతున్నారు.

భద్రాచలం దేవాయలం అభివృద్ధితో పాటు, నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యానమందిరం (రామదాసు ఇల్లు, ఆయన వాడిన బావి నేటికి ఉపయోగంలో ఉన్నాయి) అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. భద్రాచలాన్ని, నేలకొండపల్లిని రాష్ట ప్రభుత్వం పర్యాటక సర్క్యూట్‌లో చేర్చాలి. కేంద్ర ప్రభ్వుత్వం చొరవ తీసుకుని రామాయణ, శ్రీరామ తీర్థయాత్ర సర్క్యూట్ టూరిజంలో చేర్చాలనే డిమాండ్‌లు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకొని రాబోయే బడ్జెట్‌లో అభివృద్ధికి నిధులు కేటాయిస్తే బాగుంటుంది.

డాక్టర్ గోపగోని ఆనంద్

వేదిక: 

భక్త రామదాసు ధ్యాన మందిరం, నేలకొండపల్లి, ఖమ్మం

నిర్వహణ బాధ్యతలు: 

భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం

సీతారామచంద్రరామస్వామి వారి దేవస్థానం, భద్రాచలం

శ్రీ భక్త రామదాసు విధ్వత్ కళాపీఠం, నేలకొండపల్లి

ఫోన్ నంబర్లు: 9441507060, 9951203324, ౯౮౪౯౫౮౭౩౨౧