31-01-2026 12:00:00 AM
పోస్కో కేసులపై ప్రత్యేక దృష్టి
అదనపు ఎస్పీ. మహేందర్
మెదక్, జనవరి 30 (విజయక్రాంతి): నెలవారి తనిఖీల్లో భాగంగా శుక్రవారం మెదక్లోని భరోసా కేంద్రాన్ని జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పరిశీలించారు. ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, భరోసా కేంద్రం తెలంగాణ మహిళా పోలీస్ భద్రతా విభాగం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. భరోసా కేంద్రం పూర్తిగా మహిళల, పిల్లల సంక్షేమానికి, ముఖ్యంగా POCSO కేసులపై ప్రత్యేక దృష్టితో పని చేస్తోందన్నారు. బాధితులకు రక్షణ, సహాయం, పునరావాసం, అలాగే సంపూర్ణ న్యాయ సహాయం అందించడమే భరోసా కేంద్రం ప్రధాన బాధ్యత అని, FIR దశ నుంచి తీర్పు వచ్చే వరకు బాధితులకు, వారి కుటుంబాలకు లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ శ్వేత సంపూర్ణ న్యాయ సహాయం అందిస్తున్నారని, బాధితుల కోసం ప్రభుత్వ పరిహారం అందేలా కూడా చర్యలు తీసుకుంటున్నాం అని అదనపు ఎస్పీ అన్నారు.
అదేవిధంగా న్యాయ సహాయంతో పాటు కౌన్సిలింగ్ థెరపీ, అవసరమైన సందర్భాల్లో వైద్య సహాయం కూడా అందించబడుతోందని, తనిఖీ సమయంలో రిజిస్టర్లు, న్యాయ సమాచారాన్ని సమీక్షించారు. దర్యాప్తులో ఉన్న లోపాలు, బాధితుల ఫిర్యాదులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఫాలో-అప్ కౌన్సిలింగ్, కోర్టు విచారణలు, మరియు సెక్షన్ 180 BNSS ప్రకారం వాంగ్మూలాల నమోదు పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కౌన్సిలింగ్ గది బాధితులకు సురక్షితంగా, అనుకూలంగా ఏర్పాటుచేసిన వాతావరణాన్ని అదనపు ఎస్పీ గారు అభినందినందించారు. భరోసా బృందం అంకితభావంతో విధులు నిర్వహించడం అభినందనీయని అదనపు ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సౌమ్య, లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ శ్వేత, సపోర్ట్ పర్సన్ భార్గవి, నర్స్ సౌందర్య, రిసెప్షనిస్ట్ శ్రీలత, డీఈఓ లావణ్య పాల్గొన్నారు.