04-07-2024 01:12:17 AM
ఎఫ్‌ఐఆర్‌లో పేరు మాయం.. హత్రాస్ తొక్కిసలాటకు అతడే కారణం?
* గుట్టలుగా శవాలు.. ఎటు చూసినా ఆక్రందనలు.. ఆప్తులను కోల్పోయినవారి హృదయ విదారక రోదనలు.. తమవారి శవాలకోసం వెదుక్కొంటున్న దయనీయ దృశ్యాలు.. మంగళవారం యూపీలోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట తర్వాత బుధవారం వివిధ దవాఖానల్లో కనిపించిన దృశ్యాలివి. ఈ ఘటనలో మృతుల సంఖ్య ౧౨౧కి పెరిగింది. ఇంతటి దారుణానికి కారణమైన స్వయంప్రకటిత మత గురువు భోలే బాబాపై మాత్రం ఈగ వాలలేదు. అతడు ఎక్కడున్నాడో కూడా తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిం చటంలేదు.
ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినా అందులో భోలే బాబా పేరు మాత్రం లేదు. మరోవైపు ఈ హైటెక్ బాబా లీలలు ఒక్కొక్కటిగా బయట కొస్తున్నాయి. మెయిన్ పురి నియోజకవర్గంలో ఆయనకు ఓ భారీ కోటలాంటి నివాసం ఉన్నది. అందులోకి ప్రైవేటు సైన్యంతో రక్షణ ఏర్పాటు చేసుకొన్నాడు. పోలీస్‌గా జీవితం ప్రారంభించిన సూరజ్‌పాల్ అలియాస్ నారాయణ్ సకార్ హరి అలియాస్ భోలే బాబా.. రేప్‌కేసుతో.. నేరస్తుడిగా జైలు జీవితం గడిపి చివరకు మత గురువుగా అవతరించాడని తాజాగా బయటపడింది.
న్యూఢిల్లీ, జూలై 3: ఉత్తరప్రదేశ్‌లోని హథ్రస్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య ౧౨౧కి పెరిగింది. వందలమంది క్షతగాత్రులు వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజల్లో ఎనలేని అభిమానం సంపాదించిన నారాయన్ సకార్ హరి అలియాస్ భోలే బాబానే ఇంతమంది మరణానికి కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దుర్ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్, జపాన్ ప్రధాని తీవ్ర సంతాపం ప్రకటించారు.
కాగా, మంగళవారం భోలే బాబా నిర్వహించిన సత్సంగ్‌లో ౮౦ వేల మందికి అని ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకోగా, కార్యక్రమానికి ౨.౫ లక్షల మంది హాజరైనట్టు అధికారులు తెలిపారు. భోలే బాబాప్రసంగం వినేందుకు వచ్చినవాళ్లలో అత్యధికమంది పేదలే ఉన్నారు. వీరికి తగిన వసతులు ఏర్పాటు చేయటంలో ఆశ్రమ వర్గాలు పూర్తిగా విఫలమయాయి. నీరు, బురదమయమైన ప్రదేశంలో పందిళ్లు వేసి కార్యక్రమం నిర్వహించారు. సత్సంగ్ తర్వాత భోలే బాబా నడిచి వెళ్తుంటే ఆయన పాద ధూళిని తాకితే పుణ్యం వస్తుందనే నమ్మకం బలంగా ఉన్నది.
దీంతో మంగళవారం కార్యక్రమం ముగింపు సమయంలో ఆయన పాద ధూళికోసం భక్తులు ఎగబడ్డారు. మరోవైపు గంటలకొద్దీ చిన్నపిల్లలతో కార్యక్రమంలో కూర్చున్న మహిళలు ఉక్కపోతకు తట్టుకోలేక ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో భోలే బాబా కారు బయటకు వెళ్లేవరకు ఆయన సిబ్బంది భక్తులను ఎక్కడికక్కడ ఆపేశారు. కొందరు బురదలో పడిపోయారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకొన్నది.
బురిడీ బాబా
తొక్కిసలాట నేపథ్యంలో భోలే బాబా లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. దాదాపు ౧౮ ఏండ్లు పోలీస్ శాఖలో పనిచేసిన అతడు ఆ తర్వాత నేరస్తుడిగా మారాడు. ౧౯౯౭లో లైంగికవేధింపుల కేసులో జైలుకు కూడా వెళ్లాడు. తర్వాత దైవం అవతారం ఎత్తాడు. తానే దైవాన్నని ప్రచారం చేసుకొన్నాడు.
సూటు బూటు
స్వామీజీగా మారిన తర్వాత భోలే బాబా తన ఆహార్యం మొత్తం మార్చేసుకున్నాడు. ఎప్పుడూ తెల్లటి దుస్తులే ధరించేవాడు. అంతే కాకుండా నీట్‌గా గడ్డం తీసుకుని దర్శనం ఇచ్చేవాడు. ఎల్లప్పుడూ పెద్దగా ఉండే కుర్చీలో కూర్చుని ప్రవచనాలు చెప్పేవాడు. తను ప్రవచనాలు చెప్పేటపుడు ఆయన భార్య తన పక్కనే ఉండేలా చూసుకునేవాడు. స్వామీజీగా మారిన తర్వాత కోట్లకు పడగలెత్తాడు. ఎస్పీ అధినేత అఖిలేశ్ మెయిన్‌పురి నియోజకవర్గంలోనే ఆయనకు కోటలాంటి ఓ ఇల్లు ఉన్నది.