26-08-2025 12:46:55 AM
అమలకు నోచని విభజన చట్టం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ
గార్ల, ఆగష్టు 25 (విజయ క్రాంతి):- మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న (ఉక్కు) స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని చర్లపల్లి సమీపంలోని పెద్దగుట్ట తో పాటు రామచంద్రాపురం, మొట్ల తిమ్మాపురం అటవీ ప్రాంతంలో 60 ప్లస్ శాతం కలిగిన ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. బయ్యారం ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే స్థానికంగా మూడు వేల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో పదివేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల తోపాటు ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుందని ఈ ప్రాంత వాసుల అభిప్రాయం.
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అవసరమైన బొగ్గు, నీరు, డోలమైట్, విద్యుత్ వంటి వరరులు పుష్కలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 13వ షెడ్యూల్ లో తెలంగాణ రాష్ట్రంలోని బయ్యారం మండలంలో స్టిల్ అథారిటీ ఆఫ్ ఇండియా సేయిల్ ఆధ్వర్యంలో 36 వేల కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో మాదిరిగా ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని ప్రకటించారు. అయితే ప్రకటన చేసి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
బయ్యారం మండలంలో 51 హెక్టార్ల పరిధిలోని అపారమైన ముడి ఖనిజ నిక్షేపాలున్నట్లు మైనింగ్ అధికారులు నిర్ధారించారు. ఏటా నాలుగు లక్షల టన్నుల ఖనిజాన్ని మైనింగ్ చేసిన 22 ఏళ్లకు సరిపడ ఖనిజాలు ఉన్నాయని, దేశంలో లబ్యం అవుతున్న ముడీ ఇనుప ఖనిజంలో 11 శాతం నిలువలు ఉన్నాయని, 60 శాతం నాణ్యత కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాక ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని నేలకొండపల్లి, కారేపల్లి, భీమదేవరపల్లి, గార్ల, గూడూరు, ములుగు మండలాల్లో దాదాపు వందల కోట్ల టన్నుల మేర ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించారు. అయినా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై కేంద్రం సర్వేలు సమీక్షలతోనే సంవత్సరాలుగా నాన్చుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇటీవల చేసిన ప్రకటన ఈ ప్రాంత యువత ఆశలకు గండి కొట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై కేంద్రం దాటవేత ధోరణి అవలంబించడం సరైంది కాదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా బయ్యారం ఉక్కు బిక్ష కాదు హక్కుగా భావించి ఉక్కు పరిశ్రమ డిమాండ్ నెరవేర్చాలని ప్రజలు, నిరుద్యోగులు, యువతీ, యువకులు, ప్రజాసంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కోరుతున్నారు.
విభజన హామీని నెరవేర్చాలి
బయ్యారం ఉక్కు పరిశ్రమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇష్ట ఇష్టాల సమస్య కాదు. అది అనేక ఉద్యమాలు త్యాగాలతో తెలంగాణ రాష్ట్రానికి లభించిన చట్టబద్ధహక్కు. దాన్ని కాదనే అధికారం ఎవరికి లేదు. సకల సౌకర్యాలు కలిగి ఉన్న బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. విభజన హామీ కచ్చితంగా కేంద్రం నెరవేర్చాలి.
గౌని ఐలయ్య, జిల్లా కార్యదర్శి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీతో యువతకు ఉపాధి
మారుమూల గిరిజన ప్రాంతమైన మహబూబా బాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత నిరుద్యోగ గిరిజన యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి విభజన చట్టంలో పొందుపరిచి మరి కేంద్రం పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ పరిశ్రమ ఏర్పాటు విషయమై చేతులెత్తేయాలని చూడడం సరైనది కాదు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పితే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలి.
భూక్య వినోద్, నిరుద్యోగి, బయ్యారం