06-05-2025 12:00:00 AM
చర్ల, మే 5 (విజయక్రాంతి)/ బీజాపూర్: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఇద్దరు ఎస్‌టీఎఫ్ జవాన్లకు గాయాలైనట్టు సమాచారం. 14వ రోజు కొనసాగుతున్న ఈ ఆపరేషన్ సందర్భంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
గాయపడిన సైనికులను వెంటనే శిబిరానికి తరలించి అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన సైనికులలో ఒకరి పేరు థాన్సింగ్, మరొక సైనికుడి పేరు అమిత్ పాండేగా సమాచారం. అయితే నక్సల్ ఏరివేత పూర్తయ్యే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
మావోయిస్టుల జాడ కోసం భద్రతా బలగాలు నిర్విరామంగా వెతుకులాడుతున్నాయి. మావోయిస్టుల కదలికలపై డ్రోన్ల సహాయంతో నజర్ పెడుతున్నాయి. సుమారు 24 వేల మంది కర్రెగుట్టలను మోహరించినట్టు తెలుస్తోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఏజెన్సీ వాసులు భయం గుప్పెట్లో ఉన్నారు.
కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారంటూ డ్రోన్ కెమెరాల ద్వారా బలగాలకు సమాచారమందింది. మా వోయిస్టులు తమ పంథాను మార్చుకొని, ఐఈ డీ బాంబులను అమర్చుకుంటూ కర్రెగుట్టల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్తున్నట్టు డ్రోన్ కెమెరా ద్వారా పసిగట్టినట్టు సమాచారం.
మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా
భద్రతా బలగాలే లక్ష్యంగా చేసుకొని అమర్చిన మావోయిస్టుటు ఐఈడీ బాంబులు అమర్చడంతో భద్రత బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి, కర్రెగుట్టలోని ఐఈడీ పేలిన ప్రదేశాన్ని భద్రతా బలగాలు పూర్తిగా చుట్టుముట్టాయి. హెలికాప్టర్ల సాయంతో అడవిలో అతి తక్కువ ఎత్తు నుంచి జల్లెడ పడుతున్నారు.
భద్రతాబలగాలు నాలుగు నెలలకు సరిపడా ఆహార పదార్థాలు సమకూర్చుకుంటున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెట్రోలింగ్ సెర్చింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఐఈడీ బాంబులు పేలుతుండటంతో బలగాలకు కగార్ ఆపరేషన్ పెద్దసవాల్‌గా మారింది.