23-04-2025 01:21:18 AM
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
చిట్యాల,ఏప్రిల్ 22(విజయ క్రాంతి):భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం చిట్యాల మండలకేంద్రంలోని రైతు వేదికలో తహసిల్దార్ హేమ ఆధ్వర్యంలో భూభారతి 2025 రెవెన్యూ చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డిఓ రవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఏ తప్పు చేయకుండానే రైతులను, అధికారులను దోషులుగా నిలబెట్టిందన్నారు. ధరణి లోపాలు రైతులు, అధికారుల మధ్య గొడవలు సృష్టించి రైతులు ఆత్మహత్యలకు ఉసిగొల్పాయని అన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ధరణి వ్యవస్థలో సరైన మార్గదర్శకాలు లేక పొరపాట్ల సవరణకు కలెక్టర్కు మినహా ఏ అధికారికి అవకాశం లేదని, దీంతో వేల సంఖ్యలో సమస్యలు పేరుకుపోయాయని అన్నారు. భూ భారతి చట్టంలో ప్రభుత్వం భూ సమస్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా పొరపాట్ల సవరణకు, అప్పీల్ చేసుకుని సమస్య పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. భూముల వివరాలు ప్రతి సంవత్సరం డిసెంబరులో వెల్లడవుతాయన్నారు.