calender_icon.png 17 August, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీబీ ఫాతిమా ఎస్‌హెచ్‌జీకి అంతర్జాతీయ ఖ్యాతి

17-08-2025 12:44:26 AM

- ఐక్యరాజ్య సమితి ‘ఈక్వేటర్ ప్రైజ్ 2025’ పురస్కారానికి ఎంపిక

- కర్ణాటకలోని ధార్వాడ జిల్లాలో రైతులకు విస్తృతమైన సేవలు 

మహిళలు బృందంగా ఏర్పడితే అత్యంత శక్తిమంతమైన సమూహం ఏర్పడుతందనడానికి, ఆ సమూహం సమాజంలో పెద్ద మార్పులు తీసుకొస్తుందనడానికి కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా కుంద్గోల్ తాలూకకు చెందిన బీబీ ఫాతిమా స్వయం సహాయక మహిళ బృందమే (ఎస్‌హెచ్‌జీ) చక్కటి ఉదాహరణ. 2018లో తీర్థ గ్రామంలో కేవలం 15 మంది మహిళలతో బీబీ ఫాతిమా గ్రూప్ ప్రారంభమైంది. గ్రూప్ సభ్యులు తొలిరోజుల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న చిన్న, సన్నకారు వ్యవసాయ కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచాలనే సంకల్పంతో ప్రయాణం మొదలుపెట్టారు. బృందం కేవలం ఒక అంశంపై దృష్టి పెట్టకుండా, సమగ్రమైన విధానాన్ని అనుసరించింది. ముందు దేశీయ పంటల సంరక్షణకు ప్రాధాన్యమిచ్చింది.

చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించి కరువు పరిస్థితుల్లో తక్కువ నీటితో పండించడం మొదలు పెట్టింది. బృందం చేసిన కృషికి ఇటీవల ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక పురస్కారమైన ‘ఈక్వేటర్ ప్రైజ్ 2025’ వరించింది. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని కుంద్గోల్ తాలూకాకు చెందిన ఈ బృందం అనేక విజయాలను సాధించింది. పురస్కారంతో పాటు బృందానికి 10,000 అమెరికన్ డాలర్ల నగదు బహుమతి కూడా అభించనున్నది. అంతేకాకుండా, బృందం ఈ ఏడాది చివర్లో జరిగే ఉన్నత స్థాయి ఆన్‌లైన్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొననున్నది.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, బ్రెజిల్‌లోని బెలిమ్‌లో జరుగనున్న యుఎన్ క్లుమైట్ చేంజ్ కాన్ఫరెన్స్ (కాప్) వంటి అంతర్జాతీయ వేదికలపై తమ కృషిని వివరించనున్నది.పురస్కారాన్ని పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ, జీవవైవిధ్యం, ఆహార భద్రత, సుస్థిర ఆర్థిక వ్యవస్థల సృష్టి, మెరుగైన జీవనోపాధి, వాతావరణ మార్పుల కోసం కృషి చేసిన సంస్థలకు ఇస్తారు. ఈ ఏడాది పురస్కారం కోసం ప్రపంచ వ్యాప్తంగా 103 దేశాల నుంచి 700కు పైగా నామినేషన్లు వచ్చాయి.

వాటిలో నిర్వాహకులు అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, భారతదేశం, ఇండోనేషియా, కెన్యా, పాపువా, న్యూ గినియా, పెరూ, టాంజానియాకి పది సంస్థలను విజేతలుగా ఎంపిక చేశారు. విజేతలుగా నిలిచిన సంస్థలన్నీ పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, పునరుద్ధరణ, స్వదేశీ ప్రజలకు, స్థానిక సమూహాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యాలతో పనిచేశాయి. వాటి సరసన భారత్‌కు చెందిన బీబీ ఫాతిమా స్వయం సహాయక బృందం కూడా నిలవడం విశేషం. వర్షాధార ప్రాంతమైన ధార్వాడ్‌కు ఇలాంటి పంటలు అవసరమయ్యాయి. తర్వాత బృందం రైతులకు పప్పుధాన్యాలు, కూరగాయల సాగుపైనా శిక్షణ ఇచ్చింది. ఈ పద్ధతులు రైతులకు లాభాలు తీసుకురావడమే కాకుండా, నేల సారవంతాన్ని పెంచాయి.

మిల్లెట్ ప్రాసెసింగ్‌లో సవాళ్లు తలెత్తినప్పుడు, బృందం అనేక సంస్థల మద్దతు తీసుకున్నది. వ్యయప్రయాసలకోర్చి మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పింది. అలా బృందం వందలాది మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. తద్వారా వారి జీవితాల్లో మార్పులు తీసుకువచ్చింది.  తాము కేవలం శ్రామికులు మాత్రమే కాదని, వారు వ్యవసాయ సాంకేతిక నిపుణులుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగి ఇతర మహిళలకూ ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఈ బృందం ఇప్పుడు 30 గ్రామాల్లో 5 వేల మందికి పైగా రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నది. రైతులకు సంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతికతనూ బృందం చేరువ చేస్తున్నది. బృందం సౌరశక్తితో నడిచే యూనిట్‌ను సైతం నెలకొల్పడం విశేషం.

ఈ యూనిట్ ద్వారా బృందం మిల్లెట్ల ప్రాసెసింగ్‌ను సులభంగా చేపడుతున్నది. విద్యుత్ ఖర్చులు, కార్బన్ పాదముద్రల ఖర్చును సైతం తగ్గించింది. తాము తయారు చేసిన ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు బృందం విస్తృతంగా సోషల్ మీడియాను వినియోగిస్తున్నది. స్థానిక విత్తనాలను సేకరించి సంరక్షించి, రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నది. దీంతో రైతులకు విత్తన ఖర్చులు తగ్గినట్లయింది. బృందం పనితీరు ధర్వాడ  ప్రాంతంలో వ్యవసా య పద్ధతులనే మార్చింది. బృందం అనుసరించిన పద్ధతు లన్నీ పర్యావరణ హితమైనవి కావడం అన్నింటికన్నా పెద్ద విశేషం.

 కింజారపు అమరావతి, వ్యాసకర్త సెల్  8247286357