16-09-2025 12:16:11 AM
పాట్నా, సెప్టెంబర్ 15: బీహార్‌లో తయారైన రైలింజన్లను ఆఫ్రికాకు ఎగుమతి చేస్తుంటే కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులకు నచ్చడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. సోమవారం బీహార్‌లో పర్యటిం చిన మోదీ.. పూర్ణియాలో దాదాపు రూ. 36 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ‘కాంగ్రెస్, ఆర్జేడీల హయాంలో అరాచకాలు సాగించారు. ఆ రెండు పార్టీలు చొరబాట్లను ప్రోత్సహిస్తున్నాయి.
ఆర్జేడీ, కాంగ్రెస్ వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయింది. రాష్ట్రాభివృద్ధిని వారు తట్టుకోలేకపోతున్నారు. బీహార్ అభివృద్ధి పథంలోకి వెళ్లిన ప్రతిసారీ ఈ పార్టీలు రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటాయి. ఈ పార్టీలు బీహార్‌ను ద్వేషిస్తున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు వారి సొంత కుటుంబ అభివృద్ధి కోసమే పని చేస్తాయి. వారు ఎప్పటికీ ప్రజల గురించి పట్టించుకోలేదు. మోదీకి మాత్రం ప్రజలందరూ సొంత కుటుంబ సభ్యులే.
మోదీ మీ ఖర్చులను, పొదుపుల గురించి జాగ్రత్తలు తీసుకుంటాడు’ అని మోదీ ధ్వజమెత్తారు. ఇటీవల జీఎస్టీ సవరణల సందర్భంగా కేరళ కాంగ్రెస్ వివాదా స్పద ట్వీట్ చేసింది. ‘బీడీలు, బీహారీలు బీతోనే మొదలవుతాయి. ఇక బీడీలు చెడుగా పరిగణించలేం’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో తర్వాత క్షమాపణలు చెప్పి.. ట్వీట్‌ను డిలీట్ చేసింది.
అందుకు చింతిస్తున్నా: నితీశ్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడారు. ‘ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో గతంలో పొత్తులు కుదుర్చు కోవడంపై చింతిస్తున్నా. ఆ పార్టీలు ఎన్నో దుర్మార్గాలు చేశాయి. పార్టీ నేతల బలవంతంతో ఒకటి రెండు సార్లు వేరే కూటముల్లో చేరాను. ఇకపై ఎక్కడికీ వెళ్లను’ అని ప్రకటించారు.