16-09-2025 12:19:14 AM
రాంచీ, సెప్టెంబర్ 15: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ సీనియర్ కమాండర్ సహదేవ్ సోరెన్ అలియాస్ ప్రవేష్ సహా ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
హజారీబాగ్ ఎస్పీ హర్వీందర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. గోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంటిత్రి అటవీప్రాతంలో మావోయిస్టుల సంచారం ఉందని సమాచారం అందుకున్న అక్కడి పోలీస్ ఉన్నతాధికారులు ఆ ప్రాంతానికి 209 బెటాలియన్ కోబ్రా దళాలు, సీఆర్పీఎఫ్ దళాలను మోహరింపజేశారు. భద్రతా దళాలు అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతుండగా వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు ప్రారంభిం చారు.
అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. ఇరువర్గాల మధ్య కొన్ని నిమిషాల పాటు భీకర పోరు జరిగింది. జవాన్ల ధాటికి తాళలేని మావోయిస్టులు కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీప్రాంతానికి పరారయ్యారు. జవాన్లు అనంతరం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఘటనా స్థలంలో మావోయిస్టు పార్టీ సీనియర్ కమాండర్ సహదేవ్ సోరెన్, పార్టీ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యు డు రఘునాథ్ హేమాంబరం, జోనల్‌కమిటీ సభ్యుడు విర్సెన్ గంజూ మృతదే హాలను గుర్తించారు.
వీరిలో సహదేవ్ సోరెన్ తలపై రూ.కోటి రివార్డు, హేమాంబరం తలపై రూ.25 లక్షలు, గంజూ తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. అలాగే జవాన్లు కాల్పులు జరిగిన స్థలంలో మూడు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు కూం బింగ్ ఆపరేషన్‌ను ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. తప్పించుకు వెళ్లిపోయిన పార్టీ అగ్రనేతలను పట్టుకునేందుకు అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.
పెద్ద తలలే టార్గెట్..
ఆపరేషన్ కగార్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో భద్రతా బలగాలు దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఎరివేత కొనసాగిస్తున్నాయి. దీనిలో భాగంగానే తాజాగా జార్ఖండ్‌లో మావోయిస్టుల వేట సాగింది. మావోయిస్టు పార్టీలో పెద్ద తలలనే భద్రతా దళాలు టార్గెట్ చేశాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఇప్పటి వరకు సుమారు 400 మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో పార్టీ చీఫ్ కమాండర్ నంబాల కేశవరావు సహా పలువురు అగ్రనేతలు ఉన్నారు.