19.6 బిలియన్ డాలర్ల డీల్స్

25-04-2024 01:24:48 AM

60 శాతం పెరిగిన  విలీనాలు, టేకోవర్ల విలువ

పీడబ్ల్యూసీ రిపోర్ట్

ముంబై, ఏప్రిల్ 24: ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో విలీనాలు, టేకోవర్ల (ఎం అండ్ ఏ) లావాదేవీల విలువ భారీగా 60 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరిందని కన్సల్టింగ్ సంస్థ  పీడబ్ల్యూసీ ఇండియా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2023 సంవత్సరంలో ప్రతీ త్రైమాసికంలో ఎం అండ్ ఏ డీల్స్ తగ్గుముఖం పట్టినప్పటికీ, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ట్రెండ్ మారిందన్నది. గత ఏడాది తొలి త్రైమాసికంలో 12.2 బిలియన్ డాలర్ల ఎం అండ్ ఏ డీల్స్ నమోదయ్యాయి.

దేశీయంగా 143 డీల్స్ జరగ్గా, అందులో 4.5 బిలియన్ డాలర్ల విలువగల ఒక భారీ లావాదేవీ నమోదైందని తెలిపింది. వయోకామ్18, స్టార్ ఇండియా వ్యాపారాల్ని విలీనం చేస్తూ ఒక జాయింట్ వెంచర్‌ను నెలకొల్పడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీలు జతకట్టిన సంగతి తెలిసిందే. రంగాలవారిగా చూస్తే విలువరీత్యా మీడి యా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం ప్రధమస్థానంలో ఉన్నదని, రిటైల్, కన్జూమర్, పవర్, ఫార్మాస్యూటికల్, ఫైనాన్షియల్ సర్వీసుల రంగాల్లో ఎం అండ్ ఏ లావాదేవీలు జోరుగా జరిగినట్టు పీడబ్ల్యూసీ ఇండియా పార్టనర్ దినేశ్ అరోరా చెప్పారు.