13-10-2025 12:01:45 AM
కవి రేడియమ్ తన ‘జీవ గణితం’ కవితల సంపుటి ద్వారా అన్ని రకాల సామాజిక అంశాలను స్పర్శించారు. జీవగణితం కవితలో ‘రోజు మన టైంటేబుల్‌లో ఎంత ఖర్చు చేశాం.. ఎంత సంపాదించాం’ అని బేరీజు వేసుకోవాలని సూచించారు. ‘పొద్దు పొడుపు’ కవితలో ‘సమైక్య జీవన సౌందర్యంలో తన్మయత్వం చెంద వసుమతియై వసుధ పచ్చగా పరుగులు పెట్టాలి.. మరో రథయాత్ర కావాలి’ అని ఆకాంక్షించారు.
‘శాలాకిలహరి’ కవితలో చేతి వృత్తులు భారతీయ జీవనంలో భాగమని అద్భుతమైన వర్ణన చేశారు. ‘వాన కథలు’ కవితలో వర్షాకాలంలో వచ్చే వరదలు, మానవాళికి వ్యాధులు ప్రబలి వచ్చే ఇబ్బందులను కళ్లకు కట్టారు. ‘శశతంత్రం’లో మనిషిని మనిషిగా చూడమని పిలుపునిస్తారు. ‘లవణ జలం’ కవితలో సా మాన్యుల బతుకులని ఉప్పులాగే ఉంటుందని అభివర్ణించారు. ‘న్యాయం’ కవితలో ‘న్యాయమే ప్రధానం.
కలలదారిలో గమ్యం చేరాలి.. మనిషి చెట్టం త ఎదగాలి’ అని పిలుపునిస్తారు. ‘ఆకు దర్శనం’ కవితలో ‘చిత్తంలో చిగురిస్తే ప్రపంచమంతా పచ్చదనమే’ అంటూ నిర్దేశిస్తారు. ‘పంచ ముద్ర’లో చెంచుల జీవన స్థితిగతులను రాస్తూ విలపించారు. కవి వ్యాకరణంలో కర్త, కర్మ, క్రియ మనిషి జీవనంలో కీలకమైనవంటారు. అప్పు చేస్తే భవిష్యత్తులో అంతా శూన్యమే అంటూ హెచ్చరిస్తారు.
తెలంగాణ మాండలికం వజ్రాయుధమని అభివర్ణించారు. ‘కాళోజీ నారాయణ్‌రావ్ అంటే విప్లవ దుందుభి అని, అస్తిత్వ శిఖరమని కొనియాడారు. సురవరం ప్రతాప్ రెడ్డిని ‘తెలంగాణ కీర్తి’ అంటూ పత్రికా రత్నం కవితలో శ్లాఘించారు. నగ్న సత్యం అనే కవితలో ‘బాధలు అగర్వాల్ బత్తీ సుఖాలు సుర్ సుర్ బత్తీ’ అంటూ చమ త్కరించారు. మౌనం విజయానికి బావుటా అని అభిప్రాయ పడ్డారు. ‘ప్రహసనం’లో భక్తి విశిష్టత గురించి చెప్తూ ‘ప్రజల జిహ్వ అస్తమించినప్పుడు రవి క్రాంతి సంజీవి’ అని చాటిచెప్పారు.
యుద్ధం వల్ల సంభ వించే విషాదాలు మంచివి కావని ‘భయం’ కవితలో వ్యక్తీకరిస్తారు. ‘ప్రేయసి రాకకై’ కవి తలో ‘రాత్రి రమణిలో వెన్నెల చినుకుల్లో ప్రేమ తడవాలి’ అంటారు. ‘సంపాదించుకున్న అభిమాన సంపాదనకు తోడు నీడగ ఉంటే అంతా ఆనందమే.. అదే ఆనందాల జాడ’ అని ఒక కవిత్వంలో అభిప్రాయపడతారు. జీవన ప్రయా ణంలో సుఖ దుఃఖాలు వస్తూ పోతుంటాయని, మనం మా త్రం గుండె నిబ్బరంగా ఉండాలని సూచిస్తుంటారు.
‘ప్రజా కవి’ కవితలో ‘చిరు పదాలు.. తెలుగు జిలుగులు.. అవే సాహిత్య శోభ’ అని కొనియాడారు. స్నేహం గొప్పతనం గురించి ‘మిత్రలాభం’ కవితలో వివరిస్తారు. ‘జీవన సంపద’లో భవిష్యత్తు గొప్పగా ఉండాలని, అందుకు అనుగుణంగా ముందుకు పయనించాలని సూచించారు. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లకయ్యే అలంకరణ ఖర్చులపై ‘తంతు ఒకటే’ కవితలో విమర్శనాస్త్రాలు సంధించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడుతున్న వైనంపై ‘మత్తు మంట’ కవితలో వాపోతారు. ‘ఉద్దర మాటలు ఊరు దాటవు.. ఊతమియ్యవు’ అంటూ ‘నాల్గు మాటలు’ కవితలో ఉద్బోధిస్తారు.
దిగ్గజ ఉర్దూ, హిందీ కవి గుల్జార్ సాహితీ కృషిపై కవి రాస్తూ ‘గుల్జార్ కవిత్వం వసంత గులాబీ.. ఓ జ్ఞాన పీఠం’ అని కొనియాడారు. కుటిల రాజకీయాలపైనా కవి తన వాక్బాణాలు ఎక్కుపెట్టారు. రాజకీయ పార్టీ పక్షం వహించే పత్రికలపై ‘సమూహ పత్రిక’ కవితలో ‘ఓటమి, అవమానంతో గెలుపొందిన నాయకులు ప్రతికారం తీర్చుకుని తీరు తారు’ అంటూ రాసుకొస్తారు.
అన్న ట్లు చివరగా.. కవి రేడియమ్ ప్రతి పుస్తకం చివర ‘పుట్టింది.. బురదాపేటలో, చదివింది గద్వా ల కోటలో, విహరిస్తున్నది కవితా తోట లో, నడుస్తున్నది ప్రగతి శీల బాటలో’ అని స్వయంగా రాసుకుంటూ తన జీవ న తాత్వికతను చెప్పకనే చెప్తుంటారు. అవిశ్రాంతంగా కవితా సేద్యం చేస్తూ నే ఉన్నారు.